● గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

● గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాల్లో 1,600 మంది తెలంగాణ వాసుల మృతి

విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు ‘గల్ఫ్ జెఏసి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో జరిగింది.

వాల్గొండ కు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఏర్ పోర్టు నుండి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు.

“గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో (2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు) సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా వారి వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయి” అని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు.

ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు – రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు

By admin