నార్నే నితిన్.. ఎన్టీఆర్ బావమరిదిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’లో నితిన్ సంపదతో జోడీ కట్టాడు. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలైంది. నితిన్ మరో హిట్ కొట్టాడా? సతీష్ వేగేశ్న తన దర్శకత్వ ప్రతిభను నిరూపించాడా? ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథాంశం:
ఆత్రేయపురం గ్రామంలో సుబ్బరాజు (నరేష్) మరియు కృష్ణమూర్తి (రావు రమేష్) స్నేహితులు. ఒకే రాజకీయ పార్టీలో పనిచేసే వీరిద్దరూ ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్‌ కోసం పోటీ పడతారు. అయితే, వీరి పిల్లలు రాజా (నార్నే నితిన్) – నిత్య (సంపద) ప్రేమలో పడతారు. రాజా సిగరెట్ అలవాటు కారణంగా వీరి ప్రేమకథకు, అలాగే అతని రాజకీయ ఆకాంక్షలకు ఊహించని మలుపు తిరుగుతుంది. ఈ చెడు అలవాటు వల్ల కుటుంబ సంబంధాలు, ప్రేమ, రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? చివరకు రాజా తీసుకునే నిర్ణయం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన:
రాజా పాత్రలో నార్నే నితిన్ అద్భుతంగా ఒదిగిపోయాడు. సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అతని హావభావాలు ఆకట్టుకుంటాయి. పక్కింటి కుర్రాడి నుండి హీరోయిక్ యాక్టర్‌గా మారిన తీరు స్టార్ హీరో స్థాయిని అందుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. హీరోయిన్ నిత్యగా సంపద క్యూట్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తూ నటనలోనూ మెప్పిస్తుంది. నరేష్, రావు రమేష్ కీలక పాత్రల్లో చక్కటి నటనతో సినిమాకు బలం అద్దారు. రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరియు, రమ్య, ప్రియ మచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి వంటి ఇతర నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత చింతపల్లి రామారావు సినిమాను నాణ్యతగా తెరకెక్కించారు. కైలాష్ మీనన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలు ఆకట్టుకుంటాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు తగ్గట్టు సముచితంగా ఉంది. సినిమాటోగ్రఫీ గోదావరి గ్రామీణ నేపథ్యాన్ని బాగా చూపించినప్పటికీ, మరింత అందమైన దృశ్యాలు జోడించి ఉంటే బాగుండేది. ఎడిటింగ్‌లో కొంత ట్రిమ్మింగ్ చేసి ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్‌గా ఉండేది.

విశ్లేషణ:
‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ సిగరెట్ అలవాటుకు బానిసైన ఒక యువకుడి కథ ద్వారా సమాజానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ తరం యువతలోని చెడు అలవాట్లను హైలైట్ చేస్తూ, వాటి పరిణామాలను స్పష్టంగా చూపించారు. కథను సమర్థవంతంగా తెరకెక్కించడంతో పాటు, సహజమైన డైలాగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నరేష్ చెప్పే డైలాగ్, “మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే” సినిమా సారాంశాన్ని అద్భుతంగా సంగ్రహిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు, నటన కలిసి సినిమాను ఆకర్షణీయంగా మార్చాయి.

ఫైన‌ల్‌గా…
‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’ యువతకు సందేశాత్మకంగా, వినోదాత్మకంగా ఉంటూ ఆకట్టుకునే ఒక మంచి కమర్షియల్ చిత్రం. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో ఆస్వాదించదగిన సినిమా.

రేటింగ్: 3.5/5

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *