- ఎడిటరియల్:-
– స్వామి ముద్దం
సమాజ స్థితిగతుల పట్ల, మూఢాచార మత ఛాందసాలపట్ల మన లోలోపల కుతకుతలాడే భావాలకు, తిరుగుబాటుతనానికి ఓ రూపాన్నిస్తే.. అదే యోగి వేమన. ఆయన మనలోని అపరిచితుడైన తిరుగుబాటుదారుడు. జాతికి నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు, యోగి. తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టిన సుప్రసిద్ధ కవి.
‘విశ్వదాభిరామ వినుర వేమ’ అనే మాట వినని తెలుగువారు ఉండరు. వానకు తడవనివారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. తెలుగువారికి ఎంతో సారస్వత సేవ చేసిన బ్రిటిష్ అధికారి సీపీ బ్రౌన్ తోనే వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యేలా పద్యాలు చెప్పి మెప్పించిన కవి వేమన. ఆటవెలదిలో అద్భుతమైన కవిత్వం, అనంత విలువలు గల సలహాలు, సూచనలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు వేమన.
యవ్వనంలో వేశ్యాలోలుడిగా వ్యవహరించినా, కొంతకాలానికి విరక్తి చెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరకు కడప దగ్గరి పామూరు కొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామనవమి నాడు సమాధి చెందారు. కదిరి తాలూకా కటారు పల్లెలోని వేమన సమాధి ప్రసిద్ధి చెందినది. వేమన జీవితకాలం 1652-1730 గా పరిశోధకులు పేర్కొన్నారు.
వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాలేదు. కేవలం సామాన్యుల నాల్కలపైనే నడయాడుతూ వచ్చాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకుల భావన. 1816 లో ఒక ఫ్రెంచి మిషనరీ, తర్వాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ లు వేమన పద్యాలెన్నింటినో సేకరించి వాటిని లాటిన్, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించారు. అలాగే హెన్నీ బ్లూ చాంప్ (1897), విలియమ్ హెూవర్డ్ కాం బెల్ (1920), జీ.యూ పోప్, సీ.ఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.
అలాంటి మహా కవి పద్యాలు ఈతరానికి, భవిష్యత్ తరానికి అందించడం ఎంతో అవసరం. ఈ క్రమంలో వేమన పద్యాలను డిజిటలైజేషన్ చేసే ప్రయత్నాన్ని ప్రారంభించారు సంగీత దర్శకుడు, గాయకుడు బల్లెపల్లి మోహన్. వేమన పద్యాలను ఆలపిస్తూ, దానికి సంగీతాన్ని జోడిస్తున్నారు. ఇప్పటికే వందలాది వీడియోలు చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. మహా కవుల పద్యాలను నేటి తరానికి, రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని, తన బాధ్యతగా ముందుగా వేమన పద్యాలతో డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. వేమన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉన్నాయని చెప్పారు.
వేమనకు లభించిన గౌరవం మరే తెలుగు కవికీ లభించలేదు. ఐక్యరాజ్యసమితి-యునెస్కో విభాగం, ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకుని, ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. వేమన జీవితచరిత్ర, యోగి వేమన (1947), యోగి వేమన (1988), శ్రీవేమన చరిత్ర (1986) పేర్లతో సినిమాలుగా ప్రజలను అలరించాయి. పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రూపొందించిన ‘యోగి వేమన సీరియల్ టీవీ ఛానల్లో ప్రసారమైంది. ఇంతటి కీర్తిని పొందిన వేమన జయంతికి పొరుగునున్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా తగిన నిధులను కేటాయిస్తూ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తోంది. మైసూర్ మహారాజ సంస్థాన్ ఏనాడో వేమన ప్రాశస్త్యాన్ని గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో వేమనకు, ఆయన సాహిత్యానికి తగిన ప్రచారం, గౌరవాన్ని, డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
తెలుగు సాహిత్య చరిత్రలో వేమన ప్రజాకవి. సమాజములో మనిషిని నడిపించే కవిగా, సమాజాన్ని గెలిపించే చైతన్య మూర్తిగా మూఢ నమ్మకాలపై తిరుగు బాటు చేయడమే గాక, సర్వ మానవ కళ్యానికి పందిళ్ళు వేసిన మహాయోగి వేమన.