- ఎడిటోరియల్ – స్వామి ముద్దం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కార్యాలయ పని విధానాల నుంచి పరిశ్రమల దాకా—ఎక్కడ చూసినా ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ ప్రభావం కనబడుతోంది. ఈ వేగవంతమైన మార్పుల్ని చూసి ప్రపంచంలోని కోట్లాది ఉద్యోగస్తుల్లో భయం పెరిగింది. ముఖ్యంగా డెస్క్-ఆధారిత వైట్‌కాలర్ ఉద్యోగాలు AI తో భర్తీ అవుతాయనే ఆందోళన తీవ్రంగా కనిపిస్తోంది. డేటా ఎంట్రీ, BPOలు, రొటీన్ సాఫ్ట్‌వేర్ పనులు, అనలిస్టు బాధ్యతలు—ఇలాంటి పునరావృత పనులను AI ఆపాదించుకుంటోందనేది నిర్ధారణ అవుతున్న సందర్భం.
అయితే, ఇదే నేపథ్యంలో మానవాళికి అవసమయ్యే చర్చలు మొదలవుతున్నాయి.
ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కానివి నైపుణ్యం కలిగిన వృత్తులు. ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, ట్రక్కు డ్రైవర్లు, HVAC టెక్నీషియన్‌లు, కార్పెంటర్లు… వంటివి ‘భౌతిక ప్రపంచాన్ని నిర్మించే చేతులు. వీటి నిజమైన విలువ ఇప్పుడే బయటపడుతోంది.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. దశాబ్దాలుగా మన సమాజం “డెస్క్ ఉద్యోగాలే గొప్పవి” అనే భ్రమలో జీవించింది. కానీ ఇప్పుడు ఏఐ తెచ్చిన మార్పులు ఆ భ్రమను చెరిపేస్తున్నాయి. ఆనంద్ మహీంద్రా చెప్పిన ప్రకారం.. ఏఐతో భర్తీ చేయలేని ఉద్యోగాలు నైపుణ్యం కలిగిన వృత్తులే. ప్లంబర్ చేతితో సరిచేసే లీకేజీలు, ఎలక్ట్రిషియన్ పరిష్కరించే వైరింగ్ సమస్యలు, మెకానిక్ రియల్ టైమ్‌లో డయాగ్నోసిస్ చేసే లోపాలు వంటివి పుస్తకాలలో నేర్చుకునే సిద్ధాంతం కాదు, ఏఐ అల్గారిథమ్‌లు పరిష్కరించలేని పనులు. సమస్యను చూడగానే అర్థం చేసుకోవడం, దానికి తక్షణ పరిష్కారం కనుగొనడం—ఈ ఇంట్యూషన్, అనుభవ శక్తి, హస్తకౌశల్యం యాంత్రీకరణకు సాధ్యం కావు.
ఏఐ రాకతో డెస్క్ ఉద్యోగాలు కుదేలవుతాయన్న భయానికి విరుద్ధంగా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్య వృత్తులకు భారీ డిమాండ్ పెరుగుతోంది. పెద్ద సంస్థల నాయకులు దీన్ని “నేషనల్ క్రైసిస్”గా చూడడం ప్రారంభించారు.
ఫోర్డ్ మోటార్స్ సీఈఓ జిమ్ ఫార్లే హెచ్చరిక ప్రకారం.. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సంవత్సరానికి $1,20,000 వరకు జీతం ఇస్తున్నా, సరైన నైపుణ్యం కలిగిన వారు దొరకడం లేదు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. ప్లంబర్లు,
ఎలక్ట్రిషియన్లు, ట్రక్కు డ్రైవర్లు, సౌర ప్యానెల్ టెక్నీషియన్‌లు, రోబోటిక్స్ మెయింటెనెన్స్ వర్కర్లు, టెక్నీషియన్‌లు, తయారీ రంగం ఉద్యోగులు.. ఇలా 10 లక్షలకు పైగా నైపుణ్య వృత్తులు ఖాళీగా ఉన్నాయి.
డెలాయిట్–మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ఇప్పటికే హెచ్చరించింది. 2030 నాటికి కేవలం తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతాయి.
దాంతో వచ్చే ఆర్థిక నష్టం $1 ట్రిలియన్ డాలర్లు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సంకేతం.
“వృత్తి నైపుణ్యం గల వారు లేకుండా ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగదు.”
ఈ పరిష్కరానికి ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆలోచన విధానం మార్చుకోవాలి. మన దేశంలోనూ “ప్లంబర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ — తక్కువ స్థాయి వృత్తులు” అనే భావన చాలా లోతుగా ఉంది. కాని ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మార్పులు చెబుతున్నాయి—ఇవి మాత్రమే భవిష్యత్తు ఉద్యోగాలు. ఈ వృత్తుల్లో ఉన్న ఆదాయ సామర్థ్యం, గౌరవం, అవసరం—ముందు ఎన్నడూ లేనంతటి స్థాయికి పెరుగుతున్నాయి.
భారతదేశం తీసుకోవలసిన అత్యవసర చర్యలు
1. విప్లవాత్మక విద్య:
పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ—ఏ స్థాయిలోనైనా వృత్తి శిక్షణను తప్పనిసరి చేయాలి.
ITIs, పాలిటెక్నిక్‌లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లాలి.
2. నైపుణ్యాన్ని గౌరవించే సంస్కృతి:
జర్మనీ, జపాన్ వంటి దేశాలు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఎలా గౌరవిస్తాయో మనమూ నేర్చుకోవాలి. ‘వృత్తి నైపుణ్యం’ను ఉద్యోగం కాదు—కెరీర్, జీవన నైపుణ్యం అని గుర్తించాలి.
3. మెరుగైన వేతనాలు, భద్రత:
నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రోత్సహించేందుకు మెరుగైన వేతనాలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, కెరీర్ గ్రేడేషన్.. అందించడం ద్వారా యువతను ఈ రంగం వైపు ఆకర్షించాలి.
ఏఐ కోడ్ రాస్తుంది… కానీ వైరింగ్ మార్చలేం.
ఏఐ డిజైన్ చేస్తుంది… కానీ నీటి పైప్‌లైన్ మరమ్మతు చేయలేం. ఏఐ ఆటోమేట్ చేస్తుంది… కానీ కార్ ఇంజిన్‌ను సెట్ చేయడం మాత్రం కష్టం.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఏఐ ఒక పెద్ద సవాల్.
కానీ నైపుణ్య వృత్తులకు కాదు. సమాజం, విద్యా వ్యవస్థ, ప్రభుత్వం, తల్లిదండ్రులు—అందరూ ఒక కొత్త దృక్పథాన్ని స్వీకరించాల్సిన సమయం ఇది.
“దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేది—డెస్క్‌పై టైప్ చేసే చేతులు మాత్రమే కాదు, నేలమీద పని చేసే చేతులు.”
- స్వామి ముద్దం