▪️ రవీంద్రభారతీలో వేడుక నిర్వహించిన తెలంగాణ మాంగ్ సమాజ్
▪️ లహుజీ సాళ్వే తెలుగు పుస్తకం, పాట ఆవిష్కరణ
▪️ జయంతిని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా నిర్వహించాలి
▪️ భారత స్వాతంత్య్రానికి పునాది వేసిన సాళ్వే
▪️ సాళ్వే పోరాటాన్ని కొనియాడిన ప్రముఖులు
హైదరాబాద్: ప్రముఖ సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, ‘క్రాంతిగురు’ క్రాంతిగురు లహుజీ రఘోజీ సాళ్వే 231వ జయంతి వేడుకలు రవీంద్రభారతీలో ఘనంగా జరిగాయి. ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’ పేరిట మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ అధ్యక్షతన, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా, తెలంగాణ సాహిత్య అకాడమీ సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఉస్మానియా అర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాశీం, గౌరవ అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా. ఎ.నరసింహ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డా. ఎన్. బాలచారి, కాన్ఫెడ్-సోమో తెలంగాణ అధ్యక్షుడు కె.మహేశ్వర్ రాజ్, సీనియర్ జర్నలిస్ట్, రచయిత జంగిటి వెంకటేష్, తదితరులు పాల్గొని భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవకారులకు తొలి విప్లవ గురువు లాహుజీ సాళ్వే సేవలను కొనియాడారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జె.ప్రేమ్, బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.యాదగిటి, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, జి. విట్టల్ (వాణిజ్య పన్ను), హైకోర్టు న్యాయవాది ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.
గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ తెలుగులోకి అనువాదం చేసిన ‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వే’ అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ సి కాశీం గాయక్వాడ్ తులసిదాస్ కృషిని కొనియాడారు. ఒక మహానీయుడి చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో చారిత్రాత్మకంగా పుస్తకాన్ని తెలుగులో తీసుకు వచ్చే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయమన్నారు. అసలైన చరిత్ర మనం రాసుకోవాలని అన్నారు. రచయితగా మారిన తులసిదాస్‌ను ఈ సందర్భంగా అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం జంగిటి వెంకటేష్ రాసిన లహుజీపై రాసిన పాట సీడీని, వీడియోను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

దేశ స్వాతంత్య్రం, మహాత్మా ఫూలే విద్యా, సామాజిక కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించి, సమాజ శ్రేయస్సు కోసం వివాహం చేసుకోకుండా జీవితాన్ని అంకితం చేశారు లహుజీ సాళ్వే. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని వక్తలు డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించాలనే సంకల్పాన్ని తొలిసారిగా సంకల్పించి వేలాది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారు చేసి స్వాతంత్రానికి పునాది వేసిన గొప్ప యోధుడు అని, ఆ మహానీయుడి జయంతిని ‘రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్’గా ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ మాంగ్ సమాజ్ డిమాండ్ చేసింది.
చిన్నారులు గైక్వాడ్ కార్తీ, గైక్వాడ్ రితీషా నృత్య ప్రదర్శన, అలాగే లహుజీ గొప్పతనాన్ని హైలైట్ చేసే ప్రసంగాలు వేడుకలో హాజరైన అతిథులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో మాంగ్ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్, ఉపాధ్యక్షులు గాయ్ కాంబ్లే గోవింద్ మాంగ్, సంయుక్త కార్యదర్శి గాయక్వాడ్ చంద్రశేఖర్ మాంగ్, హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు కాంబ్లే సుధాకర్ మాంగ్, ఆదిలాబాద్ కమిటీ అధ్యక్షులు గాడేకర్ పరశురామ్ మాంగ్, ఎన్.రమాకాంత్ మాంగ్, తెలంగాణ సచివాలయం అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాంగ్ సమాజ్ బంధువులు హాజరయ్యారు.
