▪️ ఆకట్టుకున్న టీడీఎఫ్ ప్రాజెక్టులు
▪️ హైదరాబాద్లో సామాజిక మార్పే లక్ష్యంగా సదస్సు
▪️ వందల సంఖ్యలో పాల్గొన్న కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు
హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి, సామాజిక మార్పే లక్ష్యంగా హైదరాబాద్లోని శిల్పకళావేదిక వేదికగా ‘దక్షిణ భారత అతిపెద్ద సీఎస్ఆర్ సమ్మిట్ (South India’s Largest CSR Summit 2025)’ ఘనంగా జరిగింది. ‘సీఎస్ఆర్ నౌ (CSR Now)’ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వందల సంఖ్యలో కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని భవిష్యత్ తరాల కోసం చేపట్టాల్సిన సామాజిక కార్యక్రమాలపై చర్చించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటీ, బ్లూ క్రాస్ హైదరాబాద్ ఫౌండర్ అమల అక్కినేని, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, సీఐడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ చారు సిన్హా (IPS) తదితర ప్రముఖులు హాజరై తమ సందేశాన్ని అందించారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) ఆవశ్యకతను వారు ఈ సందర్భంగా వివరించారు. సీఎస్ఆర్ ద్వారా సమాజంలో నిజమైన మార్పు తీసుకొచ్చేందుకు అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సదస్సులో పాల్గొన్న నేతలు, నిపుణులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
ఈ సమ్మిట్లో ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF)’ ప్రదర్శించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంచేందుకు రూపొందించిన ‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ (Science Lab On Wheels)’ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడానికి వీఆర్ (VR) హెడ్సెట్లు, సైన్స్ కిట్లతో కూడిన మొబైల్ వ్యాన్లను ఎలా ఉపయోగిస్తున్నారో వివరించారు. కేవలం రూ. 933 ఖర్చుతో ఒక విద్యార్థికి ఏడాది పాటు నాణ్యమైన సైన్స్ విద్యను అందించవచ్చని, ఇది గ్రామీణ విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని తెలిపారు. ఈ ప్రజెంటేషన్ చూసిన పలు కార్పొరేట్ సంస్థలు, దాతలు ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
సమ్మిట్లో భాగంగా నీటి నిర్వహణ (Water Management), విద్య (Education) అంశాలపై జరిగిన చర్చా గోష్టులు ఎంతో ఆసక్తికరంగా సాగాయి. ఈ చర్చల్లో టీడీఎఫ్ నాయకులు గాదె గోపాల్ రెడ్డి, టీడీఎఫ్ – ఇండియా చైర్మన్ గోనరెడ్డి మారమ్, ప్రొఫెసర్ శివారెడ్డి ప్యానలిస్టులుగా పాల్గొని తమ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ పార్టనర్, ‘గ్లోబల్ ప్రగతి’ ప్రెసిడెంట్ డాక్టర్ అలోక్ అగర్వాల్, రిటైర్డ్ ఐఏఎస్ ఎం.వి. రెడ్డి, టీడీఎఫ్ నాయకులు మహేంద్ర గూడూరు, రాజేశ్వర్ రెడ్డి మట్టా, నరేందర్ రెడ్డి పాటి, రాజారెడ్డి వట్టె, సుశీల్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. పర్యావరణం, మహిళల భద్రత, గ్రామీణ విద్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకుడు వినిల్ను, ఆయన బృందాన్ని పలువురు అభినందించారు.

