- ఎడిటోరియల్ – స్వామి ముద్దం
టాలీవుడ్‌లో అరుదుగా కనిపించే, కానీ చాలా అవసరమైన ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ వేణు ఉడుగుల నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి టికెట్ ధరను సింగిల్ స్క్రీన్‌లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో రూ.105గా నిర్ణయించడం ఒక సాధారణ నిర్ణయంలా కనిపించినా, ఇది భవిష్యత్‌లో తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన మార్పుకు నాంది పలకగలదు. ఈటీవీ విన్ సంస్థ ఈ అడుగు వేయడం కేవలం ఒక సినిమా వ్యూహం కాదు.. ఇది మొత్తం సినీ పరిశ్రమకు ఇవ్వబడిన ఒక స్ఫూర్తిదాయక హెల్తీ మోడల్.
ఇటీవలి కాలంలో ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్‌సైట్‌లకు భారీగా పెరుగుతున్న వ్యూస్ చూసి చాలామంది “టికెట్ ధరలు తగ్గితే థియేటర్లకు వస్తాం” అని చెప్పిన మాట నిజమే. ప్రజలు సినిమా చూడాలనుకోరు కాదు, కానీ పెరిగిపోయిన టికెట్ ధరలు, మల్టీప్లెక్స్‌లో పెరిగిన పాప్‌కార్న్ రేట్లు ప్రేక్షకుల్ని మరింత దూరం చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈటీవీ విన్ తీసుకున్న రూ.99 నిర్ణయం ఫ్యాన్ బేస్ ఉన్న పెద్ద సినిమాలకు కాకపోయినా, మధ్యస్థ, చిన్న సినిమాలకు మాత్రం నిజమైన ఆక్సిజన్‌లాంటిది.
పైరసీ సమస్యపై ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నప్పటికీ, అసలు పరిష్కారం థియేటర్లే ఆకర్షణీయంగా మారడమే. దానికి మొదటి మెట్టు— అందుబాటు టికెట్ ధర. సాయికృష్ణ చెప్పిన “పైరసీ మన నుంచే మొదలైంది, దాన్ని ఆపే బాధ్యత మనదే” అన్న మాట నేటి పరిస్థితుల్లో నిర్మాతలు, థియేటర్ యజమానులు, ఓటీటీ సంస్థలు అందరూ ఆలోచించాల్సిన విషయం.
తక్కువ ధరలు అంటే నిర్మాతలకు నష్టం అన్న వాదన సరైనదే. కానీ సినిమాలకు ప్రేక్షకులే రాగా వసూళ్లు పెరుగుతాయి. ప్రేక్షకులు రానప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా ఫలితం సున్నా. హిందీ, మలయాళం, తమిళంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే “లవ్ యువర్ సీట్స్” ఆఫర్లు, వీకెండ్లు–వీక్‌డేస్ ధరల తేడా, స్పెషల్ డిస్కౌంట్‌లు అమలులో ఉన్నాయి. దాని ఫలితంగా చిన్న సినిమాలు కూడా బాగానే వసూళ్లు తెచ్చుకుంటున్నాయి. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ మొదలుకావడం ఎంతో అవసరం.
‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఒక చర్చను మొదలుపెట్టింది—సినిమాలు తిరిగి కుటుంబ ప్రేక్షకులను ఎలా చేరుకోవాలి? థియేటర్లకు మళ్లీ పండుగ వాతావరణాన్ని ఎలా తీసుకురావాలి? సమాధానం స్పష్టంగా ఉంది: అందుబాటు ధర – గరిష్ట హౌస్‌ఫుల్.
ప్రేక్షకుల జేబుకు భారం కాకుండా, నిర్మాతల వసూళ్లకు నష్టం కలగకుండా ఉండే మిడిల్ గ్రౌండ్ ఇదే.
టాలీవుడ్‌లోని ఇతర నిర్మాణ సంస్థలు, మల్టీప్లెక్స్ చైన్‌లు కూడా ఈ మోడల్ వైపు అడుగు వేస్తే, పైరసీకి నిజమైన దెబ్బ పడుతుంది. ధర తగ్గితే థియేటర్లకు రావడానికి రెడీగా ఉన్న లక్షలాది మంది మళ్లీ సినీపరిశ్రమకు తిరిగి వచ్చే రోజులు దూరంలో లేవు.
అందుకే ‘రాజు వెడ్స్ రాంబాయి’ చేసిన ప్రయోగం కేవలం ఒక సినిమా ప్రయోగం కాదు.. భవిష్యత్ టాలీవుడ్ కోసం వెలిగించిన ఒక మార్గదర్శక దీపం.