రెండో రోజుకు బోడె రామచంద్ర యాదవ్ ధర్మ దీక్ష
బీసీల న్యాయమైన హక్కుల సాధనే లక్ష్యంగా భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార ధర్మ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. బీసీలను రాజ్యాధికారానికి చేరువ చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ దీక్ష రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్పందనను రేకెత్తిస్తోంది.
ఈ ధర్మదీక్షకు ఇప్పటికే పలు బీసీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు సామాజిక ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. తొలి రోజున బీసీ మండల్ మనుమడు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిరావు పూలే మునిమనుమరాలు నీతాతాయి రమాకాంత్ పూలే తదితరులు హాజరై ధీక్షకు మద్దతు తెలిపారు. బీసీలకు సమన్యాయం కల్పించడంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇకనైనా బీసీలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు.
బోడె రామచంద్ర యాదవ్ ఉంచిన ఐదు ప్రధాన డిమాండ్లు సహేతుకమైనవేనని భావిస్తూ దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. తొలి రోజునే ఈ ధర్మదీక్ష సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. వైసీపీ మాజీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, బీసీల న్యాయమైన హక్కుల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తాను వెనక్కి తగ్గబోనని, తమ ఐదు డిమాండ్లను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హెచ్చరించారు. తాము చేస్తున్న డిమాండ్లు ఆచరణ సాధ్యమైనవేనని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నామన్నారు. తమ ధీక్షను భగ్నం చేసేందుకు కుట్రలు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.
బీసీల అభ్యున్నతికి కీలకమైన ఈ ఐదు డిమాండ్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అవి:
- బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం
- అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించడం
- సమగ్ర కులగణన నిర్వహించడం
- విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించడం
- బీసీ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించడం
ఈ ధీక్ష వ్యక్తిగతంగానో, తన పార్టీ ప్రయోజనాల కోసమో కాదని, బీసీల న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం చేస్తున్న ధర్మయుద్ధమని ఆయన స్పష్టం చేశారు. గత ఫిబ్రవరి 28న నిర్వహించిన బీసీ సింహగర్జన సభలో ఈ డిమాండ్లను ముఖ్యమంత్రికి ఇప్పటికే తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందన్నారు.
అలాగే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా బీసీలకు సరైన న్యాయం చేయలేదని విమర్శించారు. తాము ఇసుక, ఖనిజ సంపదలో వాటా కోరడం లేదని, రైతుల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న వేలాది ఎకరాల్లో భాగస్వామ్యం అడగడం లేదని, కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కులను మాత్రమే డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ధర్మదీక్షకు సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర నేతలు పాశం వెంకటేశ్వర్లు, టి. కళ్యాణ్ కుమార్, షేక్ నజీర్ భాషా, ఆర్జేడీ ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాము, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తూమాటి కృష్ణమాచారి, మున్నూరు కాపు తెలంగాణ అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు చాపర్తి కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, బీసీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.వి. రావు తదితరులతో పాటు పద్మశాలి, ముదిరాజ్, ఆర్య కటక, వడ్డెర, గౌడ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు.
బీసీల రాజ్యాధికార సాధన దిశగా ఈ ధర్మదీక్ష రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

https://x.com/i/status/2043212140027498720
Bode Ramachandra Yadav, BC Reservations, BC Rights Protest, BC Rights Movement, Backward Classes Welfare, BC Dharna, BC Hunger Strike, Social Justice for BCs, Caste Census Demand, 44 Percent BC Reservation, Amaravati Land Allocation for BCs, BC Protection Law, BC Corporations Funding, Political Protest Andhra Pradesh, Backward Classes Empowerment, BC Leadership Movement, Reservation Policy India