అమరావతి: పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేసే ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే దక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా ఎద్దేవా చేశారు. సంగం డెయిరీపై తప్పుడు ఆరోపణలు చేసి 33 రోజుల పాటు తనను జైల్లో పెట్టినా, సంస్థపై ఒక్క తప్పూ నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ తప్పు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశాన్ని సమర్థిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దేవుడితో ఆటలాడుతున్నారని, ఇది మంచిది కాదని ధూళిపాళ్ల హితవు పలికారు. సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో, హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ సంస్థలు ఒకటే అయితే గత వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనాలని టీటీడీ నుంచి మెయిల్స్ ఎందుకు పంపించారో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.

వైసీపీ నాయకుల రాజకీయాలు అన్నీ ఫేక్‌లేనని, వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్‌లు చేయడం వారి పేటెంట్ హక్కులేనని ధూళిపాళ్ల మండిపడ్డారు. సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించినా ఏమీ దొరకలేదని, కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ తాను భయపడలేదని చెప్పారు.

పేర్ని నాని గురించి మాట్లాడుతూ, “కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కాళ్లపై పడిన బందరు బియ్యం దొంగ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని విమర్శించారు. బందరు ఊసరవెల్లి చెప్పగానే రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు తానే రంగులు వేసానని చెప్పడం నవ్వొచ్చే విషయమని అన్నారు. సంగం డెయిరీ గుంటూరు రైతులది, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని తెలిపారు.

వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ధూళిపాళ్ల ఆరోపించారు. అప్పటి సీఎం జగన్ తనకు చెందిన మీడియా సంస్థలకు రూ.307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని, భారతీ సిమెంట్స్ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి మూడు లక్షల టన్నుల సిమెంట్ మాయం చేశారని విమర్శించారు. తనపై పెట్టిన 22 తప్పుడు కేసులను ప్రభుత్వం పరిశీలించి తప్పులేదని తేలితే వాటిని ఎత్తేయాలని కోరారు.

తిరుమల లడ్డు కల్తీ ఘటనపై మాట్లాడుతూ, లడ్డూలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు NDDB నివేదికలు వెల్లడించాయని చెప్పారు. కల్తీ నెయ్యి ద్వారా వచ్చిన అక్రమ డబ్బు విజయవాడకు రూ.12.5 కోట్లు, చెన్నైకు రూ.7.5 కోట్లు వెళ్లినట్లు SIT నివేదికలో వెల్లడైందని తెలిపారు. మార్కెట్‌లో వెన్న ధర రూ.360 ఉండగా, కేవలం రూ.316కే నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.

సంగం డెయిరీ 2020–21 నుంచే టీటీడీ నెయ్యి టెండర్ల కోసం ప్రయత్నిస్తోందని, అన్ని శాస్త్రీయ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే అవకాశం వచ్చిందని ఆయన వివరించారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి అసలు నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, దీనిపై ఎవరికైనా బహిరంగ సవాల్ విసురుతున్నానని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *