▪️ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
▪️ కృత్రిమ మేధ యుగంలో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వాలి
▪️ జర్నలిస్టులకు పలు సూచనలు చేసిన డీపీఆర్‌వో, నిపుణులు

మహబూబ్‌నగర్ (Breaking Now):
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్‌లో వక్తలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “12 ఏళ్ల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం” అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పీఐబీ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహించారు.

పీఐబీ హైదరాబాద్ విభాగం మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్‌వో) పీ. శ్రీనివాస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ సమాచార యుగంలో పాత్రికేయులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాచారాన్ని ప్రచురించే ముందు తప్పనిసరిగా వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్) చేయాలని, నైతిక విలువలను పాటిస్తూ సమాజంలో సరైన అవగాహన పెంపొందించేలా వార్తలను అందించాలని కోరారు. బాధ్యతాయుతమైన జర్నలిజం ద్వారానే ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు.

అనంతరం పీఐబీ హైదరాబాద్ విభాగం మీడియా అండ్ కమ్యూనికేషన్ అధికారి వర్గంటి గాయత్రి మాట్లాడుతూ, ‘వార్తాలాప్’ కార్యక్రమం విశిష్టతను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక భాగస్వామి అని తెలిపారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో పీఐబీ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు.

వర్క్‌షాప్‌లో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు, మీడియా విశ్లేషకుడు ముద్దం నరసింహస్వామి గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై పాత్రికేయులకు విస్తృత అవగాహన కల్పించారు.

అదేవిధంగా ప్రభుత్వ పథకాలపై వ్యాపిస్తున్న ఫేక్ న్యూస్‌ను అరికట్టాల్సిన అవసరాన్ని వివరించారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించే పద్ధతులు, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలను సూచించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను వినియోగించడం ద్వారా జర్నలిస్టులు తమ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరించారు.

డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ ప్రాముఖ్యత, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై ఫ్యాక్ట్ చెక్ శిక్షకురాలు బీఎన్ సత్యప్రియ ప్రత్యేక అవగాహన కల్పించారు. విశ్వసనీయ వనరుల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం, అసత్య కథనాలను గుర్తించడం, బాధ్యతాయుతమైన వార్తా ప్రసారానికి అవసరమైన ఉత్తమ పద్ధతులను ఆమె వివరించారు.

ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై సమాచారాన్ని ప్రజలకు అందించే సమయంలో వాస్తవ నిర్ధారణ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, విశ్వసనీయతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పాత్రికేయులకు సూచించారు.

ఈ వర్క్‌షాప్‌కు సుమారు 140 మంది జర్నలిస్టులు హాజరయ్యారు. జర్నలిజం, సమాచార ప్రసారం, డిజిటల్ మీడియా పద్ధతులు, ఫ్యాక్ట్ చెకింగ్, ఏఐ వినియోగం వంటి అంశాలపై నిపుణులతో చర్చించారు. కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులు పలు సందేహాలను వ్యక్తం చేయగా, నిపుణులు వాటికి సమగ్ర సమాధానాలు ఇచ్చారు.

మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వృత్తిపరమైన నైతిక విలువలను పాటిస్తూ కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని వక్తలు సూచించారు. బాధ్యతాయుతమైన పాత్రికేయం, డిజిటల్ అక్షరాస్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్రపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది.

కార్యక్రమం ముగింపులో డీపీఆర్‌వో పీ. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని సకాలంలో అందించడంలో మీడియా పాత్రను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పాల్గొన్న జర్నలిస్టులను ఆయన అభినందించారు.

https://breakingnow.app/mobileapp

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *