తెలంగాణలో కారుకు ఎదురే లేదు. మరో 20 ఏళ్లు మాదే అధికారం.. అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రతిసారీ చెప్పే మాట ఇది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెబుతుంటారు. అందుకే ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. కానీ తాజాగా ఓ సర్వే మాత్రం టీఆర్ఎస్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. A ONE మీడియా సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేశారు.
2023 ఎన్నికల్లో తెలంగాణ సీఎంగా ఎవరవుతారని ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంలో అడిగిన ప్రశ్నకు అత్యధికంగా రేవంత్ రెడ్డికే ఓటేశారు ప్రజలు. ఏకంగా 52 శాతం మంది రేవంత్‌కే మొగ్గు చూపారు. ఆ తర్వాత 29 శాతంతో కేసీఆర్ రెండవ స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 11 శాతం ఓట్లతో మూడోస్థానం సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ సర్వేలో బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌కు కూడా చెప్పుకోదగిన కామెంట్స్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. పకడ్బంది గా ఎమ్మెల్యేల గ్రాఫ్‌ను ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ బృందంతో సర్వేలు చేయించారు. అయితే ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా కొత్త వ్యూహాలకు తెరతీస్తున్నారు. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.