స్మగ్లర్ తగ్గేదేలే.. అంటాడా?
హీరో, డైరెక్టర్‌ను కడిగిపారేస్తా
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప-ది రైజ్’. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్లో 300 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి చిత్రంగా పుష్ప నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకుపోతున్న ఈ మూవీపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరికపాటికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గరికపాటి దంపతులు ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ప్రస్తుతం సినిమాలు ఉండటం లేదని.. ఇటీవల వచ్చిన పుష్ప సినిమానే ఉదాహరణ అన్నారు. హీరోని స్మగ్లర్‌గా చూపించడం ఏంటని, పైగా స్మగ్లింగ్ చేస్తూ తగ్గేదే లే అనే డైలాగ్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి.. చివరి అయిదు నిమిషాలు మంచి చూపిస్తాం. తదుపరి భాగం వరకు వేచి చూడండి’ అని చెప్పారు. అంటే రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని మండిపడ్డారు. ఇది ఎక్కడి న్యాయం, నేరం చేసే వ్యక్తి తగ్గేదే లే అంటాడా? ఇప్పుడు ఇదొక సూక్తి అయిపోయింది. అసలు దీనితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓ కుర్రాడు ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదే లే అంటున్నాడని.. దీనికి కారణం ఎవరని అడిగారు. ఈ డైలాగ్ తనకు కోపం తెప్పిస్తోందని అన్నారు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమా హీరోని కానీ, డైరెక్టర్ని కానీ తనకు సమాధానం చెప్పమనండని, వారిద్దరినీ అక్కడే కడిగిపారేస్తానంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తగ్గేదే లే’ అనే డైలాగ్‌ను శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటివారు వాడాలని.. అంతేకానీ, ఒక స్మగ్లర్ ఎలా వాడతాడని గరికపాటి విరుచుకుపడ్డారు. మరి గరికపాటి వ్యాఖ్యలపై ‘పుష్ప’ టీమ్ ఎలా స్పందిస్తుందోనన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.