బెజవాడ రాజకీయం కాకరేపుతోంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. టీడీపీతో కొంత కాలంగా అంటీముట్టనట్లు ఉంటున్న కేశినేని నాని.. పార్టీలోనే ఉంటారా.? లేక వైసీపీలోకి జంప్ అయిపోతారా.? అన్నది చర్చనీయాంశమైంది. ఈ ప్రశ్నలు రావడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా నాని వ్యవహారం.. సొంతపార్టీ నేతలకే ఇబ్బందికరంగా మారింది. అసలు ఈయన పార్టీలో ఉన్నాడా లేదా..? అనే చర్చ జరుగుతోందంటే.. పార్టీ క్యాడర్‌తో ఆయన ఎంత టచ్‌లో ఉన్నారో అర్థమవుతోంది.
ముందు ప్రజారాజ్యంలో పని చేసిన కేశినేని నాని.. ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమార్తెను బరిలోకి దించి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. అయితే కొద్దిరోజులుగా పార్టీలో అందరికి దూరమైపోతున్న కేశినేని.. అధికార పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన బీజేపీలోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు జరిపారు కూడా. దీనికి ఊతమిస్తూ కేశినేని భవన్ బయట గోడకు ఉన్న చంద్రబాబు ఫొటోను తీసేసి.. ఆ ప్లేస్‌లో రతన్‌టాటాతో ఉన్న ఫొటోను పెట్టుకున్నారు కేశినేని. అంతటితో ఆగకుండా పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జ్లు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించారు. వాటి స్థానంలో రతన్ టాటా ట్రస్ట్, ఎంపీ నిధులతో కేశినేని నాని చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను పెట్టారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ వ్యవహార శైలియే ఆయనను పార్టీలో ఒంటరి చేసింది.
కేశినేని నాని చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని.. వచ్చే ఎన్నికలకు మరో నేతను వెతుక్కోవాలని పార్టీ అధిష్టానానికి కేశినేని నాని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి బొండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాతో కేశినేని నానికి పొసగడం లేదు. వీరే కాదు.. పార్టీలోని ఏ నేతతోనూ ఆయన సఖ్యతగా ఉన్నట్లు కనిపించడం లేదు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయం ఈ విషయం స్పష్టమైంది. చివరకు పార్టీ అధినేత చంద్రబాబుని కూడా లెక్కచేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నారు కేశినేని. దీనిపై సొంత పార్టీ నేతలు ఆయనపై ఫైరయ్యారు. మీడియా సమక్షంలోనే తీవ్రంగా విమర్శించారు. కేశినేని వ్యవహారంపై ఇబ్బంది పడుతున్న చంద్రబాబు కూడా.. కేశినేనిపై విమర్శలు చేయకుండా నేతలను అడ్డుకోలేదు.
ఇక ఆయన సొంత సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నితోనూ నానికి పొసగడం లేదు. నాని ఒంటెద్దు పోకడలు నచ్చని పార్టీ క్యాడర్.. కేశినేని చిన్నిని కలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు ఆయనతోనే చర్చిస్తున్నారు. శివనాథ్ కూడా తన సొంత డబ్బు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీన్ని పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఆయన్ను అభినందించారని సమాచారం. దీంతో పార్టీ చీఫ్ కూడా కేశినేని నానిని పక్కనబెట్టారని అర్థమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యామ్నాయ పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌ను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీలోకి వెళ్లినా ఏపీలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే బెటర్ అని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో.. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ పార్టీ అగ్రనాయకులతో టచ్‌లోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట. గతంలోనే వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కేశినేని నానికి ఆ పార్టీ ఎంతవరకు దగ్గరకు చేర్చుకుంటుంది అనేది ప్రస్తుతానికి ప్రశ్నర్థకమే.