తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి మీడియాబాస్ సంస్థ గేమ్ ఛేంజర్ ( #GameChanZer ) సంస్థ సంయుక్తంగా ఆన్లైన్ పోల్ నిర్వహించాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేదెవరు? అనే ప్రశ్నకు సమాధానంగా అత్యధికులు బీజేపీకే ఓటేశారు. ఏకంగా 43 శాతం మంది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రెండవ స్థానంలో అధికార టీఆర్ఎస్ ఉంది. గులాబీ పార్టీపై 30 శాతం మంది నమ్మకం పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ గెలుస్తుందని కేవలం 27 శాతం మంది విశ్వసిస్తున్నారు.
గెలుపుపై పూర్తి నమ్మకంతోనే కోమటిరెడ్డి రాజీనామా చేశారని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి అభ్యర్థిత్వానికి తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అదనపు బలమని చెప్పొచ్చు. గత నెలలో గేమ్‌ఛేంజర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ గెలుస్తుందని అత్యధికులు భావించగా, తాజాగా కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ-టీఆర్ఎస్ పోరులో కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమవ్వక తప్పదని సర్వే రిపోర్టును బట్టి తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాక ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనేది ముఖ్యమని గేమ్‌ఛేంజర్ సంస్థ అభిప్రాయపడింది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. టీఆర్ఎస్ కూడా బలం పెంచుకునే అవకాశం ఉంది. కానీ తాజా పోల్ రిజల్ట్ చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్కు మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.