– బి ఎస్ రాములు
ఇవాళ జగిత్యాల చరిత్రలో గొప్ప సుదినం. నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ “దుల్దుమ్మ” అనే నవలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ నవల గా పురస్కారం అందుకుంటున్న రోజు. కల్లుగీత వృత్తి చేస్తూ నవలా రచయితగా కథకుడిగా ఎదిగాడు. ఇప్పటికీ కల్లు గీస్తూనే వున్నాడు. కల్లు గీత పని చేస్తూనే ఓపెన్ యూనివర్సిటీ బీఏ, ఎమ్మే చేశాడు. కల్లుగీస్తూనే “బతుకుతాడు” నవల రాసాడు. అది కాకతీయ యూనివర్సిటీ లో ఎమ్మే పాఠ్య పుస్తకమైంది. కొడుకు ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కల్లుగీత పని వదలలేదు. గుడిసెను ఇల్లు గా మార్చాడు. కొడుకుకు, బిడ్డకు పెళ్లి చేశాడు. అయినా కల్లుగీత పని చేస్తూనే వున్నాడు. కలం పట్టి రాస్తూనే వున్నాడు. జగిత్యాల కు రెండు కిలోమీటర్ల దూరంలోని హన్మాజిపేట గ్రామ నివాసి. మా ఇంటికి మూడు కిలోమీటర్లు. తనకులానికి, కులవృత్తి తాను పుట్టి పెరిగిన గ్రామానికి, జగిత్యాలకు ఎనలేని కీర్తి తెచ్చాడు. భార్య లక్ష్మి బీడీలు చేస్తూనే వుంది. ఆమె సహకారంకూడా తోడై జీవితం ఇలా సాగుతూ వస్తున్నది. వీరి కృషి ఎందరికో స్పూర్తి. నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ కు ఆశీస్సులు. శుభాకాంక్షలు. ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు అభినందనలు.

 

నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్.. ఒక ప్రేరణ
– వేణు క‌ట్టా

తింటానికి సరిగ్గా తిండి దొర్కని రోజుల్లల్ల ఖాళీ బువ్వ కొరకే బడికి వొయ్యి కిందా మీదా వడి ఏడోది దాకా సదివి, ఇగ ఎనిమిదోదిల బళ్ళె బువ్వ వెట్టరని సదువు బంజేసిన ఎత ఆయినెది. తాళ్ళెక్కుడు నేర్సుకొని కల్లు గీసుకుంట కుటింబాన్ని సాదుకున్న గతం ఆయినెది.

అప్పట్ల మా కాలేజీల పన్జేసిన లైబ్రేరియన్ ఆంజనేయులు సార్ సల మీద ఓపెన్ యూనివర్శిటీల షరీక్ అయిదామనుకొని ఎలిజిబిలిటీ పరీక్ష రెండు సార్ల ఫెయిలై మూడో తాపకు సీటచ్చింది. కనీసం అక్షరాలు సుత సక్కగ రాయలేని తన మొదటి ఏడు మొత్తానికి మొత్తం ఫెయిల్ అయిండు. రెండో ఏడు ఒక్క తెలుగు మాత్రమే పాసైండు. ఇగ అక్కన్నుంచి తనను తాను మలుచుకున్న తీరు తనను ఒక విజేతగా నిలబెట్టింది. ఇప్పుడు తను డిగ్రీ పూర్తి చేసి ఎమ్మే తెలుగుతో పాటు మరో పీజీ కూడా పూర్తి చేసి మల్ల సోషియాలజీల పీజీ చేసుటానికి షరీకైండు. యూజీసీ నెట్ పరీక్ష ఇయ్యనీకి సదువుతండు.

గిది గాదు అసలు ముచ్చట. ఆయినిపుడు ఒక గొప్ప నవలా రచయిత. బతుకుతాడు, దుల్దుమ్మ, సర్పంచ్, కల్తీ మనుషులు లాంటి నవలలు రాసిండు. ఆయినె రాసిన బతుకతాడు నవల కాకతీయ యూనివర్శిటీ ఎమ్మే తెలుగు సదివెటోల్లకు పాటంగా ఉంది. ఇప్పుడు ఈయినె బతుకు మీద రచనల మీద ఓ అమ్మాయి పీహెచ్.డీ చేస్తంది. గిదీ అసలు ముచ్చట.

ఈయినెవలో కాదు జగిత్యాల దగ్గరున్న హన్మాజీ పేట కు చెందిన నేరెల్ల శ్రీనివాస్ గౌడు.

ఇయ్యాల మా అంబేద్కర్ స్టడీ సెంటర్ల వ్యాస రచన పోటీలతో పాటు ఈ సెంటర్ల సదివిన ఒక గొప్ప వ్యక్తిని సన్మానించు కోవాలనుకున్నప్పుడు నాకు ఇంత కంటే గొప్ప వ్యక్తి తట్టలేదు.

విజేతలు ఎక్కడో ఉండరు. మన మధ్యనే ఉంటారు అనడానికి ఈయనే పెద్ద ఉదాహరణ. అక్షరాలు రాయలేని స్థితి నుండి అక్షరాలకు పట్టాభిషేకం చేసిన ఆయినె జీవితం ఏ మహానుభావుని జీవితం కన్నా తక్కువదేం కాదు.

చీటికి మాటికి అది లేదని ఇది లేదని తల్లిదండ్రులను, ప్రభుత్వాలను నిందిస్తూ బతికే కొంత మందికి ఈయన జీవితమే ఒక పాఠం. మనందరికీ ఒక ప్రేరణ.

By admin