వాషింగ్టన్ డీసీ, వర్జీనియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో సాహిత్య సభ ఘ‌నంగా జ‌రిగింది. తెలుగు సాహిత్యాభిమానులను ఆకర్షించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు, రచయితలు, పాఠకులు, ప్రవాస తెలుగు సాహిత్య ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖ కవి, అవధాని నరాల రామారెడ్డి, రచయిత్రి దివాకర్ల రాజేశ్వరి, మాగులూరి భానుప్రకాష్ ముఖ్య వక్తలుగా పాల్గొని, “గురజాడ రచనలు: సామాజిక బాధ్యత”, “సినీ ప్రపంచంలో శ్రీ శ్రీ పాట” వంటి అంశాలపై ఆసక్తికరమైన చర్చలు జరిపారు. వారి విశ్లేషణాత్మక వ్యాఖ్యలు సభికులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా దివాకర్ల రాజేశ్వరి రాసిన కథాసంపుటి “పగడాల దీవి” పుస్తకాన్ని వేణు నక్షత్రం ప‌రిచ‌యం చేశారు. కొత్తగా కథలు రాయాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక దిక్సూచి లాంటిది అని అభివర్ణించారు.

‘ఆటా’ సాహిత్య విభాగం సభ్యులు భూపతి విహారి నిర్వహించిన కవి సమ్మేళనంలో అనేకమంది కవులు తమ రచనలను ప్రదర్శించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలుగా చంద్ర చెళ్ళపిళ్ళ (ప్రథమ బహుమతి), సౌజన్య గుడిపాటి (ద్వితీయ బహుమతి), సుశీల సత్యవోలు (తృతీయ బహుమతి) నిలిచారు. పాల్గొన్న కవుల రచనలు ప్రేక్షకులను కట్టిపడేసాయి, ఈ వేదిక వారి సృజనాత్మకతకు మార్గదర్శనం అందించింది.

ఆటా సాహిత్య విభాగం స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా నాయకత్వంలో, ఆటా పూర్వ అధ్యక్షులు భువనేష్ భుజాలా, కార్యనిర్వాహక సభ్యులు సుధీర్ భండారు, జీనత్ రెడ్డి సహా ఇతర ఆటా బృందం సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత సజావుగా, ఆహ్లాదకరంగా జరిగింది.

వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన ‘ఆటా’ కార్యనిర్వాహక బృందం నిర్వహించిన మొట్టమొదటి సాహిత్య సభగా ఈ కార్యక్రమానికి భారీ స్పందన వ‌చ్చింది. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈ వేదిక భవిష్యత్తులో మరిన్ని సాహిత్య కార్యక్రమాలకు బీజం వేస్తుందని ప‌లువురు వ‌క్త‌లు కొనియాడారు.

Photos

https://photos.google.com/share/AF1QipMS2AQNQFObGWYq55gSio_6JD5GFtLms1Oy-t3ZdDj0PzxdtX56bugrIlhkA82XyA?key=V3pKUzlORmRyVkFabmhWc1pYYWtQSENiVHRTTmZ3