• Breaking Now

ములుగు జిల్లా 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రంలో 8వ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా DNR ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్డ ప్రతాప రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దొడ్డ ప్రతాప రెడ్డి మాట్లాడుతూ, “గ్రామీణ జిల్లాగా, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ములుగు జిల్లా విద్యారంగంలో అసాధారణ పురోగతి సాధిస్తోంది. 10వ తరగతి ఫలితాలు ఈ విజయానికి స్పష్టమైన నిదర్శనం,” అని ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారుల చొరవ, 40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, ప్రధానోపాధ్యాయుల నాయకత్వం, ఉపాధ్యాయుల ముందుచూపు, విద్యార్థుల కఠోర శ్రమ, అంకితభావం ఈ విజయానికి కారణమని కొనియాడారు.

ప్రత్యేకించి, దేవగిరిపట్నం ఉన్నత పాఠశాల 100% ఫలితాలు సాధించినందుకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి శ్రీ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. “ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బాటలు వేస్తాయి. రాబోయే రోజుల్లో అడ్మిషన్లు పెంచుకోవడానికి ఉపాధ్యాయులు మరింత శ్రమించి, అంకితభావంతో పనిచేయాలి,” అని ఆకాంక్షించారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ, “మంచి కోర్సులను ఎంచుకొని, ఉత్తమ ప్రవర్తనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని” కోరుకున్నారు.

ఈ విజయం ములుగు జిల్లా విద్యారంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏటూరునాగారం మండ‌ల టాప‌ర్‌గా ర‌క్షిత‌

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల్లో ఏటూరునాగారం మండ‌ల రామ‌న్న‌గూడెం జిల్లా ప‌రిస‌త్ పాఠ‌శాల‌కు చెందిన గార ర‌క్షిత మండ‌ల టాప‌ర్‌గా నిలిచింద‌ని ఎంఈవో కొయ్య‌డ మ‌ల్ల‌య్య తెలిపారు. 600 మార్కుల‌కు గాను 571 మార్కులు సాధించిన‌ట్టు తెలిపారు. రెండో స్థానంలో ఇర‌స‌వ‌డ్ల శ‌ర‌ణ్య 559/600, ఏటూరునాగారం జ‌డ్పీహెచ్ఎస్ పాఠ‌శాల‌కు చెందిన హ‌ర్షిత్ 559/600 మార్కులు సాధించార‌ని తెలిపారు.