డబ్బు అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్-3’. ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో వస్తున్నాం అంటూ ప్రమోట్ అయిన ‘ఎఫ్ 3’ ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించగలిగిందో ప్రి రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే..
లోకంలో పంచభూతాలతో పాటు మరో భూతం ఉంది.. అదే డబ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది. వెంకీ పాత్రలో వెంకటేష్, వరుణ్ పాత్రలో వరుణ్ తేజ్ .. డబ్బు, బంగారం అంటే ఆశ పడే భార్యలకు భర్తలుగా కనిపించారు. బాగా డబ్బు సంపాదించడానికి నానా పాట్లు పడే వీరికి, లోపాలు కూడా ఉంటాయి. వెంకీకి రేచీకటి ఉంటే, వరుణ్ కి నత్తి ఉంటుంది. మరి తమ లోపాలను కవర్ చేస్తూ.. డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏమి చేశారు ? ఈ ప్రాసెస్ లో తమన్నా, మెహరీన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు ? ఈ మధ్యలో సునీల్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ పాత్రలు ఏమిటి ? చివరకు వెంకీ – వరుణ్ ఏమి సాధించారు ? అనేది మిగిలిన కథ.
డైరెక్టర్ అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాడు. అలాగే క్వాలిటీ ఫన్‌తో ఫుల్‌గా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో బాగా ఎంటర్టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే వెంకీ -వరుణ్‌ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా వెంకటేష్ ‘వెంకీ పాత్ర’లో లీనం అయిపోయాడు. తన మార్క్ బాడీ లాంగ్వేజ్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్ టేబుల్ దగ్గరే స్క్రిప్ట్ ను బలంగా రాసుకున్నాడు. అదే స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల పరిణామ క్రమాన్ని కూడా చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో పాత్రలు, వాటి పరిచయం, కొన్ని కీలక సన్నివేశాలు సరదాగా సాగుతూ.. జోష్ పెంచాయి.
కాకపోతే.. సెకండాఫ్‌లో స్టోరీ కాస్త నెమ్మదిస్తుంది. కామెడీ మూవీ కాబట్టి.. అనిల్ కూడా స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. దాంతో ఈ సినిమా కామెడీ సినిమాగానే మిగిలిపోయింది. నిజానికి కొన్ని సీన్స్‌లో ఎమోషన్స్ పండినా.. ప్రతీ పాత్రకూ జస్ట్ జస్టిఫికేషన్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు. హీరోయిన్లు తమన్నా, మెహరీన్, పోలీస్ గా రాజేంద్రప్రసాద్, కోటీశ్వరుడిగా మురళీశర్మ, ఫ్రెండ్ గా సునీల్ తమ పాత్రల్లో జీవించారు. మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి తన కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు. కాకపోతే, వెంకటేష్ తన కామెడీ టైమింగ్ సినిమా రేంజ్‌ని పెంచాడు. అలాగే మిగిలిన భారీ తారాగణం కూడా ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ సినిమా నవ్వులు పూయించింది. కామెడీ సినిమాలు ఇష్టపడేవారికి, ఈ సినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.