హైదరాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ లో ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత ‘సంతోషం’ సురేశ్ కీలక బాధ్యతను చేపట్టారు. FNCCలోని కల్చరల్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ప్రస్తుతం ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యవహరిస్తున్నారు. ఆయనకు దన్నుగా, కో ఛైర్మన్ గా ప్రముఖ నటుడు శివాజీ రాజా, వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి లను నియమిస్తూ FNCC అధ్యక్షుడు జి. ఆదిశేషగిరిరావు, గౌరవ కార్యదర్శి ముళ్ళపూడి మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్చర్ కమిటీ కన్వీనర్ గా ఏడిద రాజా వ్యవహరిస్తున్నారు. FNCC లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు విలువలైన సలహాలను ఇవ్వాల్సిందిగా FNCC కార్యవర్గం సురేశ్ కొండేటిని ఈ సందర్భంగా కోరింది.
చిత్రసీమలో అందరికీ తలలో నాలుకగా మెలిగే సురేశ్ కొండేటి గతంలోనూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఎఫ్.ఎన్.సి.సి.లలో వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. ముఖ్యంగా ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడిగా, కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా తన సేవలను అందించారు. మరోసారి FNCC తన మీద నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని సురేశ్ కొండేటి హామీ ఇస్తూ, కమిటీ సభ్యులందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు.