తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం.

ముస్తాబాద్: మ‌హిళ‌లకు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్).. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవల‌ప్‌మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ కేంద్రాన్ని పోలీస్ పటేల్ మట్ట రామలింగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబంతోపాటు సమాజం మెరుగుపడుతుందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కే సిలిండర్ల వంటి పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. అలాగే పావ‌ల వ‌డ్డి రుణాలను సైతం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మీటింగ్‌కు వచ్చిన మహిళలకు కుట్టు మిషన్ల గురించి పూర్తి అవగాహన క‌ల్పించారు. మహిళల అభివృద్ధి కోసం టీడీఎఫ్ ఉచిత కుట్లు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమ‌ని అన్నారు. తెలంగాణ ఉద్య‌మంలో, తెలంగాణ‌ అభివృద్దిలో టీడీఎఫ్ ఎన్నారైల పాత్ర ఎంతో కీల‌క‌మ‌ని కొనియాడారు. బీడీలు చుట్టే మ‌హిళ‌లు తంబాకు వాస‌న‌తో అనారోగ్య‌న బారిన ప‌డ‌తార‌ని, ఎంతకాలంగా అదే వృత్తిగా కాకుండా, మహిళలు కుట్టుమిషన్ వంటి ఉపాధి ప‌నుల‌కు మారాల‌ని కోరారు.

సిరిసిల్లలో స్కిల్ డెవల‌ప్‌మెంట్ సెంటర్‌ని ఓపెన్ చేసి సిరిసిల్ల యువతకు తమవంతు సహాయం చేయాలని మహేందర్ రెడ్డి కోరారు. ఒకవేళ టీడీఎఫ్ వాళ్లు ముందుకు వస్తే రాష్ట్ర‌ ప్ర‌భుత్వంతో మాట్లాడి స్కిల్ డెవల‌ప్‌మెంట్ సెంటర్‌కు కావాల్సిన‌ స్థలం ఇప్పిస్తానని కేకే చెప్పారు. టీడీఎఫ్ స‌భ్యులు తెలంగాణ అభివృద్దికి చేస్తున్న సేవ చాలా గొప్పదని కొనియాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ రూరల్‌లో ఉచిత కుట్టు మిషన్ సెంటర్‌ను నిర్వహించేందుకు శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్‌కు బల్లలు, కుర్చీలు, బల్లలు, టైలరింగ్ పరికరాలను టీడీఎఫ్ అందించింది. గతంలో టైలరింగ్ బ్యాచ్ పూర్తి చేసిన మహిళలకు కూడా మహేందర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.

టీడీఎఫ్ – ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం సంస్థ తెలంగాణ అభివృద్ధి కోసం సేవ చేస్తున్న ఒక స్వ‌చ్ఛంద సంస్థ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనా కోసం టీడీఎఫ్ ఎంతో కృషి చేసిందని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్రంలో సేవ కార్య‌క్ర‌మాలు చేస్తున్న సంస్థ టీడీఎఫ్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీఎఫ్ ప్రవాస స‌భ్యుల‌ పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఇలాంటి ఎన్నో సేవ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ సంస్థ ద్వారా అనేక ప్రాజెక్టులు చేపడుతున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా గ‌తంలో ప్ర‌కృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు ధాన్యాన్ని రక్షించుకోవడానికి టార్పలిన్ కవర్లు రాష్ట్రంలో నలుమూలల అందించామ‌ని గుర్తు చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామ‌న్నారు. మనబడి కార్యక్రమం చేపట్టి మౌలిక సదుపాయాలు టీడీఎఫ్ ద్వారా అందించామ‌ని తెలిపారు.

టీడీఎఫ్ ఉమెన్ ప్రెసిడెంట్ టి. వాణి మాట్లాడుతూ… టీడీఎఫ్ వనిత చేయూత ప్రాజెక్ట్‌లో భాగంగా చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి వివరించారు. మహిళలు ప్రతి ఒక్క‌రు నిబద్ధత, క్రమశిక్షణ‌తో ముందుకి వెళ్లాల‌ని కోరారు. మహిళలు ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాల‌ని కోరారు. మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సెట్విన్ సంస్థ సిద్దిపేట‌ మేనేజ‌ర్ అమీనా.. త‌మ సెట్విన్‌లోని ఉపాధి కోర్సుల గురించి మ‌హిళ‌ల‌కు వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ ఉమెన్ ప్రెసిడెంట్ టి. వాణి, టీడీఎఫ్ జనరల్ సెక్రెటరీ వినీల్, వెంకటేశ్వర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సునీత, వెంకటేశ్వర ఫౌండేషన్ సెక్రటరీ తిరుమలరెడ్డి, సెట్విన్ సిద్దిపేట్ మేనేజర్ అమీనా, మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, ఉచ్చిడి బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఒరగంటి తిరుపతి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తోట ధర్మేందర్, కొండం రాజిరెడ్డి, రంజాన్ నరేష్, సారుగు రాకేష్, ఆరుట్ల మహేష్ ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

By admin