◉ 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ కుటుంబాల ప్రభావం 
– మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు

గల్ఫ్ అంటే.. అగాధము, లోతైన ఇరుకైన సముద్ర ప్రవేశద్వారం అని అర్థం. గల్ఫ్ దేశాలు, కార్మికులు అనగానే అరబ్ దేశాలలో వారి కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వస్తాయి. గల్ఫ్ కార్మికులకు ఓట్లు లేవు.. ఓటర్ లిస్ట్ లో పేరున్నవారు కూడా అంత దూరం నుంచి వచ్చి ఓటెయ్యరు అనే భావనతో అధికార బిఆర్ఎస్ వారి సంక్షేమాన్ని విస్మరించింది. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదు. గల్ఫ్ కార్మికుల జీవితాలు ఎడారి లాగా ఎండిపోవడానికి కారణమైన రాజకీయ నాయకుల తలరాతలను మార్చడానికి గల్ఫ్ కుటుంబాలు అదను కోసం చూస్తున్నాయి.

వారు సప్త సముద్రాలు దాటి ఎడారి దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసి కార్మికులు. వీరిలో చాలా మందికి సొంత ఊర్లో ఓటర్ లిస్ట్ లో పేర్లు లేవు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలలు ఆ చిరునామాలో నివసించకపోతే ఓటర్ లిస్ట్ లో పేరు తొలగించవచ్చు. ఈ కారణంగా గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న వారి పేర్లు ఓటర్ లిస్ట్ లో నుండి తొలగించబడుతున్నాయి. ఓవర్సీస్ ఎలక్టర్ క్యాటగిరీలో ఫారం 6-ఎ ఆన్ లైన్ లో నమోదు చేసుకొని ఎన్నారై ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు కానీ అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం లేక ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంతో కొంత సంపాదిస్తున్నారు, ఊర్లో ఉండటం లేదనే కారణంతో రేషన్ కార్డుల్లో గల్ఫ్ కార్మికుల పేర్లు తీసేస్తున్నారు.

కూతురి ఓటమితో గల్ఫ్ కార్మికులపై కోపం   
గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికులు.. తెలంగాణకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు. కానీ, వారి కుటుంబాల ఓట్లు మాత్రం కీలకం కాబోతున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ టీఆర్ఎస్ ఓటమికి గల్ఫ్ కార్మికుల ఓటు బ్యాంకు కూడా ఒక కారణం అని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలిన తర్వాత గల్ఫ్ కార్మికుల పట్ల కేసీఆర్ మరింత కోపం పెంచుకున్నట్లు  తెలుస్తున్నది. నిజామాబాద్ లో తన కూతురు కవిత ఓటమికి గల్ఫ్ సమస్య ఒక ప్రధాన కారణం కావడాన్ని  జీర్ణించుకోలేక మరింత మొండిగా వ్యవహరిస్తూ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇటీవలి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్ఫ్ వలస కార్మికులతో కేసీఆర్ కు 45 ఏళ్ళ క్రితం జరిగిన ఒక చేదు అనుభవం వారిపై పగబట్టేలా చేసిందని ఆయన సమకాలికులు భావిస్తున్నారు.

ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ లలో ప్రస్తుతం 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు నివసిస్తున్నారు. గత 20 ఏళ్లలో మరో 30 లక్షల మంది గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో స్థిరపడ్డారు. గల్ఫ్ ఆధారిత కుటుంబాల ఓటు బ్యాంకు ఒక కోటి వరకు ఉంటారు. పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లిన అన్ని కులాలు, అన్ని మతాల పేద కార్మికులు ఇందులో ఉన్నారు. వీరి భార్యా పిల్లలు బంధువులు బీడీ కార్మికులుగా, వ్యవసాయ దారులుగా బలీయమైన శక్తిగా ఉన్నారు. గల్ఫ్ కార్మికులు ఓటు బ్యాంకుగా సమీకృతం కావడం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త కోణం.

ప్రధాన పార్టీలకు గల్ఫ్ గండం
గల్ఫ్ కార్మికుల ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలపమైన అధికార బిఆర్ఎస్ గల్ఫ్ కుటుంబాలకు దూరమైంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, బిజెపి లు గల్ఫ్ సమస్యలపై ఉద్యమించడంలో విఫలమైనవి. శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యులు మొక్కుబడిగా గల్ఫ్ సమస్యలను ప్రస్తావించి చేతులు దులుపుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గల్ఫ్ వలసలపై నిర్లక్ష్యంగా ఉన్నది. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పనులేమీ చేయలేదు. రాహుల్ గాంధీ సందేశంతో ఇటీవల టిపిసిసి విడుదల చేసిన నాలుగు పేజీల చార్జిషీట్ కరపత్రంలో గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. మూడు ప్రధాన పార్టీలు బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి లకు ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గండం పొంచి ఉన్నది. వీరికి గల్ఫ్ గుబులు పట్టుకుంది. గల్ఫ్ కుటుంబాల ప్రాధాన్యతను గుర్తించిన మూడు చిన్న పార్టీలు బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్సార్ టిపి లు  గల్ఫ్ సమస్యలను బలంగా లేవనెత్తుతూ ముందుకు వెళుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గల్ఫ్ ఎన్నారైలు, గత ఎనిమిదిన్నర ఏళ్లుగా హక్కుల సాధన ఉద్యమంలో ముందున్న గల్ఫ్ వలస కార్మిక నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. చిన్న పార్టీల కూటమి ప్రవాసుల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి పావులు కదుపుతున్నట్లు తెల్సింది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ (ధన ప్రభావం  లేని రాజకీయం) అనే నినాదంతో వీరు సమాయత్తమవుతున్నారు. మరో వైపు అర్థ బలం కలిగిన అమెరికన్, యూరోపియన్ ఎన్నారైలు ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నారు.

గల్ఫ్ ఉద్యమం.. రాజకీయ అడుగులు

అధికార, ప్రతిపక్షాలు గల్ఫ్ సమస్యలను పట్టించుకోవడం లేదని, పసుపు బోర్డు ఉద్యమం తరహాలో గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీ సాధన పోరాటాన్ని ఉధృతం చేయాలని గల్ఫ్ కార్మిక సంఘాలు యోచిస్తున్నాయి. మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అనే సూక్తి ప్రకారం తమ సమస్యల పరిష్కారం కోసం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎత్తుగడగా ఉపయోగించుకోవాలని గల్ఫ్ కార్మిక ఉద్యమకారులు పావులు కదుపుతున్నారు.

ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చినవారు ఓటు బ్యాంకు గా ఏర్పడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన 14 అసెంబ్లీ నియోజకవర్గాలను పోలీస్ ఇంటలిజెన్సీ వర్గాలు గుర్తించాయి. ఆ స్థానాలు నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్.

దగాపడ్డ గల్ఫ్ అన్నలు 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం తో పాటు  ప్రజల ఉపాధి వలసలకు, సంక్షేమానికి సంబంధించిన బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదం ముఖ్యమైనది. బొగ్గుబాయి అనగా స్వరాష్ట్రంలో వలసలకు సూచిక.  లక్ష ఇరవై వేలున్న సింగరేణి కార్మికులు సగానికి తగ్గి పోయారు. బొంబాయి అనగా పక్క రాష్ట్రానికి వలసలకు సంకేతం. దుబాయి అనగా అంతర్జాతీయ వలసలకు ప్రతిబింబం. అంతర్గత వలసలు, అంతర్ రాష్ట్ర వలసలు, అంతర్జాతీయ వలసల గురించి తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయలేదని వలస కార్మికుల్లో అసంతృప్తి ఉన్నది.

గల్ఫ్ సంక్షేమ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు సాయం, గల్ఫ్ కార్మికులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా, పెన్షన్ వంటివి అపరిష్కృతంగా ఉన్నాయి. గత ఎనిమిదిన్నర ఏళ్లలో 1,700 మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాలలో ప్రాణాలు కోల్పోయినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లోని శవపేటికల రిజిస్టర్ చెబుతున్నది. పంజాబ్ లో చనిపోయిన రైతులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర  గల్ఫ్ మృతులకు మొండి చేయి చూపాడు.

రాష్ట్ర ఖజానాకు రూ.15 వేల కోట్ల జమ 

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ప్రతినెలా 1,500 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. ఈ విధంగా ఏడాదికి 18 వేల కోట్ల రూపాయల చొప్పున గత ఎనిమిదిన్నర ఏళ్లలో… ఒక లక్ష 53 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు చేరి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడింది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల విదేశాల నుంచి పొందుతున్నఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత ఎనిమిదిన్నర ఏళ్లలో 15 వేల 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

దేశాభివృద్ధికి వారు ఆర్థిక జవాన్లు 

వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు.

భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. ఈ మాత్రం ఫారెక్స్ రావడానికి గల్ఫ్ కార్మికుల చెమట చుక్కలు, ఇతర దేశాల్లోని ఎన్నారైల శ్రమయే కారణం. ప్రభుత్వాలకు ప్రవాసులు పంపే సొమ్ముపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. కానీ ప్రవాసి కార్మికుల బతుకులు మారడానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు.

(వ్యాస‌క‌ర్త‌: మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు +91 98494 22622 )

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin