GWTCS స్వర్ణోత్సవ ఉత్సవాల లోగో ఆవిష్కరణ సభలో అధ్యక్షులు కృష్ణ లాం

అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) స్వర్ణోత్సవ వేడుకల లోగో ఆవిష్కరణ పూర్వ అధ్యక్షులు, కార్యవర్గం, దాతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఎన్నో తరాల సాక్షిగా ఐదు దశాబ్దాల ఘన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఈనాడు స్వర్ణోత్సవాల ముంగిట నిలబడ్డామని.. తెలుగు భాష మన ఆస్తి, అస్తిత్వం అని.. పుట్టి పెరిగిన జన్మభూమికి .. ఉపాధి కోసం ఉంటున్న కర్మ భూమికి.. భాషే వారధి అని అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. యాభై సంవత్సరాల క్రితం (1974) అమెరికా లో ఏ ఆశయంతో ఐతే ఆనాడు పెద్దలు ఉన్నత మార్గదర్శకాలతో ఈ సంస్థను స్థాపించారో.. మాతృదేశానికి దూరంగా వున్నా.. మనదైన భాష, కట్టు, బొట్టు, పండుగ, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ.. ఏదేశ మేగినా, ఏ రంగంలో కాలిడినా మన జాతి ఔన్నత్యాన్ని చాటుకోవటం, నిలబెట్టుకోవటం మనందరి సమిష్టి భాద్యత అని పూర్వ అధ్యక్షులు, పెద్దలు జక్కంపూడి సుబ్బారాయుడు, మూల్పూరి వెంకట్రావు, మన్నే సత్యనారాయణ, సాయిసుధ పాలడుగు తెలిపారు. తానా పూర్వ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సతీష్ వేమన, గంగాధర్ నాదెండ్ల, నరేన్ కొడాలి, రవి పొట్లూరి,జనార్దన్ నిమ్మలపూడి పాల్గొని.. మాట్లాడుతూ ఈ సంస్థ తానా తో సహా.. ఎన్నో సంస్థలు మాతృక అని.. ప్రవాస సంస్థ లెన్నున్నా లక్ష్యం ఒక్కటే అని అది మన భాష, సంస్కృతి పరిరక్షణ అన్నారు.ఈ తరానికి సైతం పిల్లలకు మన పండుగలు, ప్రాముఖ్యత, సంప్రదాయాన్ని అందిస్తున్న ప్రవాస సంఘాలలో GWTCS స్థానం ప్రధమం అని తెలిపారు. అన్ని విధాలుగా ఈ స్వర్ణోత్సవ వేడుకలకు తమ తోడ్పాటు అందిస్తామని తెలిపారు. పెద్దలు మన్నవ సుబ్బారావు, తేజ, సాయికాంత రాపర్ల.. మాట్లాడుతూ.. లక్షలాది మంది తెలుగువారు ఈనాడు వృత్తి, ఉపాధి రీత్యా అమెరికాకు వస్తున్నా.. ఐదు దశాబ్దాలుగా తెలుగు వారికోసం ఒక సమున్నత వేదికను కాపాడి, తరతరానికీ తెలుగు భాషను వారధిగా, సాంస్కృతిక కార్యక్రమాలను అందిస్తున్న కార్యవర్గ సభ్యులను, సహకరిస్తున్న భాషాభిమానులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, దాతలు, శ్రేయోభిలాషుల సమక్షంలో లోగో ను ఆవిష్కరించారు.మాతృభూమి భారతదేశాన్ని, కర్మ భూమి అమెరికాను అనుసంధానిస్తూ భాష,చరిత్ర ప్రాతిపదికగా ఈ లోగో రూపొందించారు.ఈ కార్యక్రమంలో నాగ్ నెల్లూరి, విజయ్ గుడిసేవ, సత్య సూరపనేని, అశోక్ దేవినేని, అనిల్ ఉప్పలపాటి, వేణు జంగా, సాయి బొల్లినేని, నవ్య ఆలపాటి, సమంత్, మురళి తదితరులు పాల్గొన్నారు..

By admin