“ప్రెస్ క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా మారుస్తాం” — కొత్త కార్యవర్గం హామీ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌ 2025–2027 నూతన పాలకమండలి శుక్రవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించింది.  ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎస్. విజయ్‌కుమార్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు అరుణ అత్తలూరి, ఏ. రాజేష్, సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరి ప్రసాద్, బాబురావు. వి, ఖజాంచి రమేష్ వైట్ల బాధ్యతలు చేపట్టారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్. ఉమాదేవి, మర్యాద రమాదేవి, రాజేశ్వరి కళ్యాణం, శంకర్ శిగ, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు వనం, శ్రీనివాస రెడ్డి, రచన ముడింబి, అశోక్ దయ్యాల, ముత్యాల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు, అమిత్ భట్టు బాధ్యతలు స్వీకరించారు.

ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ సమక్షంలో పాత పాలకమండలి మినిట్స్ బుక్‌ను కొత్త కార్యవర్గానికి అందజేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కొండ శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరుగాంచిన హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సీనియర్‌ పాత్రికేయులు కొత్త కమిటీకి సూచించారు.

తమపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ఎన్నికల సమయంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని నూతన పాలకమండలి హామీ ఇచ్చింది. పూర్వాధ్యక్షుడు ఎల్. వేణుగోపాల్ నాయుడు, పూర్వ ప్రధాన కార్యదర్శి ఆర్. రవికాంత్ రెడ్డి లు తమ బాధ్యతలను కొత్త కమిటీకి అధికారికంగా అప్పగించారు.

ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్‌ను ఫ్యామిలీ క్లబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, సభ్యులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కొత్త పాలకమండలి తెలిపింది. నవంబర్‌లో ఫ్యామిలీ గెట్-టు-గెదర్‌ నిర్వహించి, వివిధ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వారు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు సురేందర్, జనం సాక్షి అధినేత రెహమాన్, సీనియర్ పాత్రికేయులు సీ.జీ.కే మూర్తి, బి. కిరణ్, హాష్మీ తదితరులు పాల్గొన్నారు.