– వాషింగ్టన్ డీసీలో తెలుగు కుటుంబాల సందడి

వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలోని మేరీలాండ్ డమాస్కస్ రిక్రియేషనల్ పార్క్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ పిక్నిక్ ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. సాగింది. మెరిలాండ్, వాషింగ్టన్ డీసీ, ఉత్తర వర్జీనియా ప్రాంతాల్లో నివసించే తెలుగువారి కోసం ఏర్పాటు చేసిన ఈ పిక్నిక్‌కి సుమారు 600 మంది హాజరయ్యారు. పిల్లలు, పెద్దలు, ఇండియా నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్లు ఈ వేడుకలో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.

క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు, రుచికరమైన భోజనం ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. బింగో, లెమన్ స్పూన్, ఫ్రిస్బీ, తగ్ ఆఫ్ వార్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో వంటి ఆటలు నిర్వహించగా, మెహందీ డిజైన్లు, మేజీషియన్ ప్రదర్శనలు, సంగీతం, నృత్యం పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. రాఫిల్ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేశారు.

పిక్నిక్ సందర్భంగా మానవతా దృక్పథంతో ఫుడ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా పాల్గొన్నవారు నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్ అందించి Manna Food Center‌కి గణనీయంగా సహకారం అందించారు.

ATA అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వంలో, ఆర్‌సీలు పార్థ బైరెడ్డి, క్రిష్ణా రెడ్డి, జీనత్ రెడ్డి, ట్రస్టీలు శ్రీధర్ భాణాల, విష్ణు మాధవరం, పూర్వ అధ్యక్షులు భువనేశ్ భూజాల, సుధీర్ దామిడి, సతీష్ వడ్డి, రవి చల్లా, వేణు నక్షత్రం, రమేష్ భీంరెడ్డి, అమర్ పాశ్య తదితరుల సమన్వయంతో ఈ వేడుకలు అత్యంత విజయవంతంగా నిర్వహించారు.

ATA తదుపరి కన్వెన్షన్ 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నట్లు జయంత్ చల్లా వెల్లడించారు. ఇది వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో నిర్వహించే తొలి ATA కన్వెన్షన్. ఈ సభలను ఘనంగా నిర్వహించేందుకు అందరూ ముందుగా నుంచే సిద్ధమవ్వాలని పూర్వ అధ్యక్షుడు భువనేశ్ భూజాల పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన ఆర్గనైజర్లు, వాలంటీర్లు, స్పాన్సర్లు, హాజరైన ప్రతి కుటుంబానికి ATA కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.