(కందుకూరి రమేష్ బాబు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ )

ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా వ్యక్తులు కొందరు తెలంగాణాలో ఆకర్షిస్తున్నరు. రాణిస్తున్నరు. నిర్దిష్ట సమస్యల నుంచి విశాల ప్రాతిపదికను సమకూర్చుకుంటున్నరు. ‘నిరుద్యోగ’ బర్రెలక్క నుంచి ‘గల్ఫ్ సంఘీభావ అభ్యర్థి’ దాక…వారి ప్రాతినిధ్యం విజయంగా మారడానికి నూటికి నూరు శాతం అవకాశాలున్నవి.

నిజానికి మొత్తం ఫలితాలను మార్చే ఓటర్ల సంఖ్య ఐదారు వేలే అన్నది గనుక నిజమే అయితే, వాటిని సాధించగలిగితే, మొట్ట మొదటిసారిగా ఒక గల్ఫ్ విజయం నమోదవడం అసాధారణ విషయం అవుతుంది. అపుడు గల్ఫ్ జెఎసి కృషి ఫలించి ఈ ‘బహుజన వెలమ’ అసెంబ్లీ సాక్షిగా గల్ఫ్ కార్మికుల తరపున సింహనాదమే చేస్తారు.

నిర్దిష్ట సమస్యలు తీసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నిర్వాసితులు ఉన్నారు. నిరుద్యోగులూ ఉన్నారు. ధరణి బాధితులున్నారు. వీరేగాక మొదటిసారిగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఒక్కత్రాటి మీద నిలిచి ఈ ఎన్నికల్లో బలంగా తమ ఉనికిని చాటేందుకు గల్ఫ్ జెఎసి తరపున నిలబడ్డ ఐదుగురు అభ్యర్థులూ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో నలుగురు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తాలూకు సింహం గుర్తు మీద పోటీ చేస్తుండగా సిరిసిల్ల అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఈ ఐదుగురిలో ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతడు కోరుట్ల నియోజక వర్గ అభ్యర్థి చెన్నమనేని శ్రీనివాస్ రావు. ప్రధాన స్రవంతిలో వినిపించని గల్ఫ్ వేదనామయ జీవితాలకు అతడిప్పుడు ఆశావహ ప్రతిరూపం. అతడి గుర్తే కాదు, జీవితమూ ఒక సింహనాదం.

గద్దర్ ఇచ్చిన బిరుదు ప్రకారం ఇతడు ‘బహుజన వెలమ’. కులానికి వెలమే అయినా అతడిది ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబంలో వికసించిన నిరుపేద బాల్యం. అవిశ్రాంతంగా ఎదురీదిన యవ్వనం. స్వయంకృషితో వన్నెతేలిన వ్యక్తిత్వం. చెరుకు రైతులకు అండగా ముత్యంపేట ఫ్యాక్టరీ తెరిపించాలని చేపట్టిన ఉద్యమంలో అతడిది క్రియాశీల పాత్ర. మహిళా రైతులు బోనాలు తలకెత్తుకుని ధర్నాకు దిగేలా చేసిన సాంస్కృతిక సేనా వ్యూహకర్త. వ్యాపారంలో స్థిరపడి వెనక్కు వచ్చాక అభివృద్దికి దూరంగా అనేక విధాలా నిర్వేదంగా ఉన్న కోరుట్ల పునర్వైభవం నడుం కట్టిన ధీరుడు. ఫలితంగా ఈ నియోజక వర్గంలో పోటీ పడుతున్న హేమాహేమీలైన ప్రత్యర్థుల దరిదాపుల్లో ఓట్లు పొందే అవకాశం ఏర్పడటంతో ఈ ‘గల్ఫ్’ అభ్యర్థి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

‘సిఎస్ ఆర్’ అని ఆత్మీయులు పిలుచుకునే శ్రీనివాస్ రావు గల్ఫ్ కార్మిక కుటుంబాల ఆదరణను మాత్రమే గాక కోరుట్ల నియోజకవర్గంలోని ఇతర ఓట్లను కూడా గణనీయంగా పొందే అవకాశం ఉన్నది. అందుకు తగ్గ నేపథ్యం కూడా అతను గత కొన్నేళ్లుగా ఏర్పాటు చేసుకోవడంతో అత్యంత వేగంగా తన అభ్యర్థిత్వానికి నిర్దిష్ట ఓటర్ల నుంచే కాక వివిధ సామాజిక ఓటర్లందరినీ ఆకర్షించి ప్రధాన పార్టీ అభ్యర్థులతో పొటీ పడే స్థాయికి చేరుకోగలిగారు. ఒక రకంగా ఇతడిని నిలబెట్టడంలో గల్ఫ్ జె ఏసీ ఆశించిన వ్యూహం నేరవేరిందనే చెప్పాలి.

చెన్నమనేని శ్రీనివాస్ రావు నిజానికి మిగతా నలుగురు గల్ఫ్ అభ్యర్థుల్లా గల్ఫ్ కార్మికుడు కాదు. కానీ గల్ఫ్ సమస్యల పరిష్కారం కోసం సంఘీభావంగా నిలబడ్డ వ్యక్తి. ఆ సంఘీభావమే అతడిని కోరుట్ల నియోజక వర్గంలో అత్యధికంగా ఉన్న గల్ఫ్ కార్మికుల ఓట్లను పొందేలా మాత్రమే కాదు, నియోజకవర్గంలో తాను చేపట్టిన పలు ఉద్యమాల కారణంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, నేతన్నలు మొదలు, మహిళా బీడీ కార్మికులు, ఒంటరి స్త్రీలు, వితంతువులకు ఆదరణీయుడిని చేసింది. విద్యార్థుల్లో కూడా మంచి అభిమాన పాత్రులయ్యారు. వీటికి తోడు సామాజిక వర్గం ప్రకారం కులానికి వెలమ కావడం, ఆర్థికంగా కూడా మంచి స్థితిమంతుడు కూడా కావడంతో, చురుకుదనం, దీక్షాదక్షతలతో పాటు పరపతి ప్రతిష్టా గల నాయకుడిగా ఎదగడం, ఇవన్నీ కలిసి రావడంతో తాను మొదటిసారిగా ఎన్నికల్లో నిలబడ్డప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలకు సమవుజ్జీగా మారారు. ప్రచారంలో దూసుకు పోతున్నారు.

వారు సి ఎస్ ఆర్ ఫౌండేషన్ పేరుతో చేపట్టిన అనేక సామాజిక కార్యక్రమాల వల్ల వేలాది కుటుంబాలకు సన్నిహితులయ్యారు. వీటన్నిటికి తోడు ముఖ్యంగా రాష్ట్రావతరణ తర్వాత గల్ఫ్ కార్మికులను ఏ విధంగానూ బిఆర్ ఎస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బాధ్యతగా స్పందించి అనేక బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయడమే గాక కార్మికులు దుర్మరణం పొందినప్పుడు వారి శవపేటికలు ఇంటికి చేర్చి అంత్యక్రియలు చేయడం, పిల్లల చదువు సంధ్యలకు తోడ్పాటు అందించడం కారణంగా శ్రీనివాస రావు గారు ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారారు. ఆ ఆత్మీయత కారణంగా దాదాపు ఇరవై ఐదువేల గల్ఫ్ కార్మికులున్న ఈ నియోజకవర్గంలో ఇంటికి కనీసం మూడు ఓట్లు వేసే అవకాశమే గాక ఆతడిని ఎన్నికల్లో ముఖ్య అభ్యర్థుల్లో ఒకరిగా మలిచేందుకు అనేక సమూహాల మద్దతు ఆశావహంగా ఉన్నది. ఫలితంగా గల్ఫ్ జెఎసి ఆశించినట్లు చెన్నమనేని శ్రీనివాస్ రావు తమ ఉనికిని బలంగా చాటుతున్న నేతగానే గాక ప్రధాన రాజకీయ పార్టీలకు తక్కువేమీ లేని వ్యక్తిగా ప్రచారంలో దూసుకు వెళుతున్నారు.

ముందు చెప్పినట్లు అతడు గల్ఫ్ సంఘీభావ అభ్యర్థిగా నిలబడ్డప్పటికీ అతడికి విశాలమైన ప్రజా శ్రేణుల నుంచి మద్దతు లభిస్తోందన్న అంచనాకు ఇటీవల నిర్వహించిన ఒక సర్వ్ విశ్వసనీయ అభిప్రాయం కలిగిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, హేమా హేమీలైన కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపి ప్రత్యర్థులను ఎదుర్కొంటూ వేగంగా తాను ప్రజల్లో ఆదరణ పెంచుకుంటున్నారు. ‘పోటీ చేయడమే గెలుపు’ అనుకున్న దశ నుంచి అన్ని శక్తులూ కేంద్రీకరిస్తే గెలుపు కూడా అసాధ్యమేమీ కాదన్న భావనకు చేరుకున్నారు. దాంతో మిగతా చోట్ల నిలబడ్డ గల్ఫ్ అభ్యర్థులు కూడా కోరుట్ల నియోజకవర్గంలో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం విశేషం.

తన తండ్రి ఆకస్మికంగా చిన్ననాడే మరణించడంతో తల్లి విధిలేక బీడీలు చేసి పెంచి పెద్ద చేసింది. తాను చదువుకుంటూనే బర్రెలు కాసిన వ్యక్తి. ప్రతిభావంతుడు కావడంతో గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. కానీ ఆర్ధిక ఇబ్బందులు అతడిని ఉన్నత చదువులకు దూరం చేయడంతో కోరుట్ల లోనే ‘మాత మేస్’ తెరిచాడు. ‘బ్లూఫాక్స్’ పేరిట మరో రెస్టారెంట్ కూడా నడిపారు. కానీ నష్టాలు రావడంతో హైదరాబాద్ వెళ్లి అదృష్టం పరీక్షించుకోమని అభిమానంగా ఒక రేషన్ డీలర్ ఇచ్చిన ఏడొందల రూపాయలతో ఆయన భాగ్యనగర ప్రవేశం చేశారు. ఆ డబ్బులతో ప్రారంభమైన చిరు వ్యాపార జీవితం అతడిని అనతికాలంలోనే వివిధ వ్యాపారాల్లో రాణించేలా చేసింది. ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడేలా చేసింది. సంపాదన ఒక్కటే జీవితం కాదని కోరుట్ల తిరిగి వచ్చిన శ్రీనివాస్ రావు ఈ గడ్డకోసం, ఇక్కడి ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా ఏమైనా చేయాలని నిర్ణయించుకునేలా చేసింది. ముఖ్యంగా స్వరాష్ట్రంలో నిధులు లేమితో పునర్నిర్మాణానికి దూరమైన కోరుట్లను ఎట్టి పరిస్థితులలోనైనా పునర్వైభవానికి నిర్ణయించుకున్నారు. అందుకు ఉద్యమిస్తే తప్పా పనులు కావని గ్రహించి ప్రజా యుద్దనౌక గద్దర్ మొదలు వివిధ ప్రజా సంఘాలను రప్పించి చెరుకు రైతులకు అండగా పోరాటం ప్రారంభించారు. పసుపు రైతుల సమస్యలను ఉద్దేశించి పని చేశారు. గురుకుల పూర్వ విద్యార్థుల సమావేశాలను ఆర్గనైజ్ చేసి, విద్యార్థుల విరాళాలతో బడులకు శోభ తెచ్చే కార్యాచరణకు నడుం కట్టారు. బీడీ పరిశ్రమలో ఉన్న మహిళలకు పెన్షన్ సదుపాయం 2014 తర్వాత కూడా ఇవ్వలని పోరాడుతున్న నేత అతను. నేడు, రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న వలస కార్మికులైన గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కోరుట్ల ఎన్నికల బరిలోనే నిలబడ్డారు. ఇవన్నీ అతడిని నిర్దిష్ట సమస్యలపై పోరాడుతున్న అభ్యర్థిగానే కాకా విశాల ప్రజా రాశుల మద్దతు పొందే నేతగా మారుస్తుండటం విశేషం. వీటన్నిటి కారణంగా, కేవలం ఐదారు వేల నుంచి పదివేల ఓట్లు గెలుపుని ప్రభావితం చేసే పరిస్థితి ఈ నియోజక వర్గంలో ఉన్నందున అతడు శాసన సభకు వెళ్ళే అవకాశాన్ని కాదనలేని స్థితి.

కాగా, ఇటీవల కోరుట్లలో ఏర్పాటు చేసిన గల్ఫ్ గర్జనలో తాను గెలిస్తే నియోజక వర్గానికి చేసే పనుల జాబితాను బాండు పేపర్ మీద రాసి విడుదల చేయడం చూసిన వ్యక్తిగా, అందులో అతడి విజన్ ను చదివిన వ్యక్తిగా రాజకీయాలకు అతీతంగా ఒక అభిప్రాయం ఏర్పడింది. ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా వ్యక్తులు కొందరు తెలంగాణాలో ఆకర్షిస్తున్నరు. రాణిస్తున్నరు. నిర్దిష్ట సమస్యల నుంచి విశాల ప్రాతిపదికను సమకూర్చుకుంటున్నరు. ఉదాహరణకు నిరుద్యోగ’ బర్రెలక్క నుంచి గల్ఫ్ సంఘీభావ ‘బహుజన వెలమ’ దాక …చెప్పలేం. ఇలాంటి వాళ్ళ గళం కూడా మనం అసెంబ్లీలో నేడో రేపో వినే పరిస్థితిపై నమ్మకం కలుగుతుంది. నమ్మకం కన్నా ఒక ఆశావహ పరిస్థితి నమ్మకం కలిగిస్తోంది. దీనికి మరో ముఖ్య ఆధారమూ ఉన్నదని చెప్పాలి.

ముందు చెప్పినట్లు అతడు గల్ఫ్ సంఘీభావ అభ్యర్థిగా నిలబడ్డప్పటికీ అతడికి విశాలమైన ప్రజా శ్రేణుల నుంచి మద్దతు లభిస్తోందన్న అంచనాకు ఇటీవల నిర్వహించిన ఒక సర్వ్ తో పాటు ఈ వ్యాసకర్త చేసిన క్షేత్ర స్థాయి పర్యటన విశ్వసనీయ అభిప్రాయం కలిగిస్తోంది. చాలా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, హేమా హేమీలైన కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపి ప్రత్యర్థులను ఎదుర్కొంటూ వేగంగా తాను ప్రజల్లో ఆదరణ పెంచుకుంటున్నారు. ‘పోటీ చేయడమే గెలుపు’ అనుకున్న దశ నుంచి అన్ని శక్తులూ కేంద్రీకరిస్తే గెలుపు కూడా అసాధ్యమేమీ కాదన్న భావనకు చేరుకున్నారు. దాంతో మిగతా చోట్ల నిలబడ్డ గల్ఫ్ అభ్యర్థులు కూడా కోరుట్ల నియోజకవర్గంలో కూడా విస్తృతంగా ప్రచారం చేయడం విశేషం.

నియోజకవర్గంలో పోటీ చేస్తున్న 15 మంది అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల గురించి చెప్పుకుంటే స్థానిక అభ్యర్థి డా.కల్వకుంట్ల సంజయ్. వారి తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆయన ప్రస్తుత శాసన సభ్యులుగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అతడి కుమారులు సంజయ్ గారు మూడో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండో ప్రధాన అభ్యర్థి వివాదాస్పద ధర్మపురి అరవింద్ గారు. వారు మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు డి.శ్రీనివాస్ గారి తనయులన్నది తెలిసిందే. బిజెపి అభ్యర్థి ఐన ఇతను రెండో స్థానంలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గారి కుమారులు జువ్వాడి నర్సింగ రావు గారు. వారు కాంగ్రెస్ పార్టీ అనేక విధాలా బలపడినందున పోటీలో ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా నాలుగో స్థానంలో చెన్నమనేని శ్రీనివాస్ రావు గారు ఈ హేమాహేమీలతో పోటీ పడటం విశేషం.

ఎన్నికల శాతాన్ని గనుక లెక్కతీసి చూస్తే, కోరుట్లలో రెండు లక్షాల 36 వేల ఓట్లలో దాదాపు 75 శాతం ఓటు హక్కును వినియోగిస్తే ఒక లక్షా 77 వేలు పోలవుతాయని అంచనా. నవంబర్ 25 నాటికి చేసిన ఒక సాంపిల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి 26 శాతం ( ఓట్ల సంఖ్య- 46, 020 ), బిజెపి అభ్యర్థి 24 శాతం (42, 480), బిఆర్ఎస్ అభ్యర్థి 23 శాతం ( 40, 710) ఓట్లు సాధిస్తుండగా చెన్నమనేని శ్రీనివాస్ రావు గారు 17 శాతం (39, 090), ఇతరులు 10 శాతం ( 17,700) ఓట్లు సాధిస్తారని అంచనా ఉన్నది.

ఐతే, శ్రీనివాస్ రావు తర్వాత బిఎస్పీ తరపున పోటీలో ఉన్న పూదరి నిశాంత్ కార్తీకేయ, ధర్మ సమాజ్ పార్టీ తరపున నిలబడ్డ పోడేటి రమేష్ తో పాటు మరి నాలుగు పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. వీరితో పాటు ఐదుగురు ఇండిపెండెంట్లు కూడా నిలబడ్డారు. అట్లా చూస్తే, మొత్తం పదిహేను మందిలో నాలుగో స్థానంలోకి చేరుకున్నట్లు కానవస్తున్న చెన్నమనేని శ్రీనివాస్ రావు గారు ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ మందికి చేరువగా వెళ్లి ప్రజాభిప్రాయాన్ని మరింత అనుకూలంగా మలుచుకుంటే ప్రధాన రాజకీయ పార్టీ ఐన బిఆర్ ఎస్ ను తప్పించి మూడో స్థానంలోకి చేరుకుంటారు.

నిజానికి మొత్తం ఫలితాలను మార్చే ఓటర్ల సంఖ్య ఐదారు వేలే అన్నది గనుక నిజమే అయితే, అంతగా ఐతే పదివేల లోపే అని గుర్తుస్తే, వాటిని సాదించగలిగితే ఎన్నికల రంగంలో మొట్ట మొదటిసారిగా ఒక గల్ఫ్ విజయం నమోదవడం అసాధారణ విషయం అవుతుంది. అది లక్షాలాది వలస కార్మికులకు ఆకాంక్ష. అది తప్పక వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని, పునరావాసాన్ని నిర్ణయాత్మకం చేసే పెద్ద విజయం అవుతుంది. అలా గనుక జరిగితే అది రాజకీయంగా ఒక నూతన చరిత్రకు మార్గం వేస్తుందని కూడా చెప్పాలి. అప్పుడు గద్దర్ అన్నట్టు ఈ ‘బహుజన వెలమ’ గల్ఫ్ కార్మికుల కోసం అసెంబ్లీలో సింహనాదమే చేయవచ్చు. వారి ఎడారి జీవితాలకు అసలైన ఒయసిస్సుగా మారవచ్చు. అలా జరగడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండకపోవచ్చు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin