మల్లాపూర్ (మీడియాబాస్ నెట్‌వర్క్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన క్యాతం ఐశ్వర్య రెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలో 467 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. అలాగే సిరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్ మణిమాల 436 సాధించి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మండలానికి చెందిన రెండు గ్రామాల విద్యార్థినిలు రాష్ట్ర మొదటి, రెండవ స్థానాలు సాధించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో గ్రామంలో చిన్నారి విద్యార్థులు ఏకాగ్రతతో అత్యధిక మార్కులు సాధించి మండల పేరు ప్రతిష్టలు పెంచారని పలువురు అభినందించారు.
రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ప్రజాప్రతినిధుల అభినందనలు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన నూనావత్ మణిమాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి రెండవ ర్యాంకు లో నిలవడంతో విద్యార్థినికి, విద్యార్థిని తల్లిదండ్రులు నూనావత్ రాజు హారికలకు గ్రామ సర్పంచ్ భుక్య గోవింద్ నాయక్, ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు శుభాభినందనలు తెలియజేశారు. మన గ్రామంలో చిన్నారి విద్యార్థులు ఏకాగ్రత తో అత్యధిక మార్కులతో సాధించి గ్రామ పేరు ప్రతిష్టలు పెంచాలని, మణిమాల సిరిపూర్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలపడం గ్రామానికే గర్వకారణమని, భవిష్యత్తులో మంచి డాక్టర్ పట్టా సాధించి ప్రజలకు వైద్యసేవలందించే స్థాయికి చేరుకుని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.