తెలంగాణ ఎంపీలకు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం యధాతదంగా ఇలా ఉంది.
భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (రాయబార దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలి. హైదరాబాద్ లో యూఏఈ కాన్సులేట్ ఏర్పాటు చేయడానికి నాలుగేళ్ల క్రితం తేది: 28.06.2018 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సమ్మతిని తెలియజేసింది. హైదరాబాద్ లో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు చేయాలని 2016 నుండి చేసిన విజ్ఞప్తులకు సౌదీ అరేబియా ప్రభుత్వం సూత్రప్రాయంగా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.
◉ ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీ కొరకు రెండేళ్ల కోసం రూ. 325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో రెనివల్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ కేవలం ప్రమాద మరణం (యాక్సిడెంట్ డెత్) కు మాత్రమే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సహజ మరణం (నేచురల్ డెత్) కూడా కవర్ అయ్యేలా ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి. అవసరమైతే కొంచెం ప్రీమియం పెంచండి లేదా సబ్సిడీ ఇవ్వండి. ఇది గల్ఫ్ మృతులకు ఎంతో ఉపయోగపడే విలువైన అంశం. గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,700 మంది తెలంగాణ వలస కార్మికులు మృతి చెందారు.
◉ ఖతార్‌లో భారతీయ కార్మికుల మరణాలపై భారత ప్రభుత్వం మౌనం వీడాలి. 2010-20 మధ్య కాలంలో ఖతార్‌లో 2,711 మంది భారతీయులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఫుట్‌బాల్ స్టేడియంలు, సంబంధిత నిర్మాణాలు, ఇతర పనులు చేసే కార్మికులు వివిధ కారణాలతో మృతి చెందారు. గత పదేళ్లలో ఖతార్‌లో దాదాపు 100 మంది తెలంగాణ వలస కార్మికులు మరణించినట్లు ఒక అంచనా. మరణానికి కారణం ఏదయినా… ఖతార్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.
◉ కోవిడ్19 కాలంలో గల్ఫ్ దేశాల నుండి వాపస్ వచ్చిన ‘వేతన దొంగతనం’ బాధితులను భారత ప్రభుత్వం ఆదుకోవాలి. గల్ఫ్ తదితర దేశాల నుండి తిరిగి వచ్చిన వలస కార్మికులకు వారి విదేశీ యజమానుల నుండి వారికి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ (ఉద్యోగ అనంతర ప్రయోజనాలు) పొందడానికి న్యాయ సహాయం అందించండి.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews