హైదరాబాద్: ఆశ్లి క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మిస్టీరియస్”. మహీ కోమటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని “అడుగు అడుగునా” అనే స్ఫూర్తిదాయకమైన పాటను హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. అంకితభావంతో పనిచేసే ఓ పోలీస్ అధికారి కర్తవ్య దీక్షను వర్ణిస్తూ ఈ పాటను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ, “ఒక పోలీస్ అధికారి నిబద్ధతను, త్యాగాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ‘అడుగు అడుగునా’ పాట ఎంతో అద్భుతంగా ఉంది. గాయకుడు యమ్.యల్.ఆర్. కార్తికేయన్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. పోలీసుల మనోభావాలను ప్రతిబింబించేలా చక్కటి సాహిత్యం అందించి, సంగీతం సమకూర్చిన యమ్.యల్. రాజా గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సస్పెన్స్ థ్రిల్లర్ కథను కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు మహీ కోమటిరెడ్డికి, అమెరికాలో స్థిరపడినా సినిమాపై మక్కువతో ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత జయ్ వల్లందాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు,” అని తెలిపారు.
చిత్ర నిర్మాత జయ్ వల్లందాస్, దర్శకుడు మహీ కోమటిరెడ్డి మాట్లాడుతూ, “ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, మా అభ్యర్థనను మన్నించి, మా చిత్రంలోని కీలకమైన ఈ పాటను విడుదల చేసిన కమీషనర్ సివి ఆనంద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాట ఈ రోజు నుండి మా ‘ఆశ్లీ మ్యూజిక్’ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రేక్షకులందరూ ఈ పాటను చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు రోహిత్ సాహిని, గౌతమ్, సహ నిర్మాత రామ్ ఉప్పు (బన్నీ రామ్) చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
చిత్ర యూనిట్ వివరాలు:
చిత్రం: మిస్టీరియస్
నిర్మాణ సంస్థ: ఆశ్లి క్రియేషన్స్
నిర్మాత: జయ్ వల్లందాస్
సహ నిర్మాత: రామ్ ఉప్పు (బన్నీ రామ్)
దర్శకుడు: మహీ కోమటిరెడ్డి
సంగీతం, సాహిత్యం: యమ్.యల్. రాజా
గానం: యమ్.యల్.ఆర్. కార్తికేయన్
నటీనటులు: రోహిత్ సాహిని, గౌతమ్ తదితరులు.