అరుదైన కథనంతో విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో చాలా కాలం తర్వాత తెలుగు స్క్రీన్ పైకి వచ్చిన చిత్రం “రుద్రంకోట”. సీనియర్ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటించిన “రుద్రంకోట” తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనిల్ ఆర్కా హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమాకు రాము కోన దర్శకత్వం వహించాడు. విభీషా, అలేఖ్య హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇవాళ్టి రివ్యూ రిపోర్ట్ లో తెలుసుకుందాం.
కథ:
రుద్రంకోట ఊరిలో జరిగిన కథ ఇది. ఊరిలో కట్టుబాట్లను ఎవరూ మీరకుండా కోటమ్మ (జయలలిత) కాపలాగా ఉంటుంది. ఊరిలో ఆమె చెప్పిందే వేదం. నిజాయితీతో కూడిన ప్రేమికుల్ని కోటమ్మ కలుపుతుంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్లను, కామాంధులను కోటమ్మ ఆజ్ఞతో రుద్ర (అనిల్ ఆర్కా) కాటికి పంపుతుంటాడు. ధృతి (అలేఖ్య) రుద్రంకోటలో అడుగుపెట్టడంతో ఊరిలో ఎలాంటి మార్పులు వచ్చాయి. ధృతి ఎవరు? కోటమ్మతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంది? ఊరి జనాలకు దూరంగా రుద్ర స్మశానంలో బతకడానికి కారణం ఏమిటి? రుద్రను ప్రేమించిన శక్తి (విభీషా) ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల ప్రతిభ :
ప్రధాన పాత్ర కోటమ్మగా జయలలిత నటన సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. తన అనుభవంతో పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. ఇక రుద్రగా అనిల్ ఆర్కా మాస్ పాత్రలో మెప్పించాడు. మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడులా తన పాత్రకు పరిపూర్ణత చూపించాడు. మరోవైపు గ్లామర్ పరంగా అలేఖ్య సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. విభీషా తన పాత్ర పరవాలేదు.
కోటమ్మ, రుద్ర పాత్రల పరిచయంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ధృతి పాత్ర ఎంట్రీ…ఆ తర్వాత రుద్ర, శక్తి కథను చూపిస్తూ చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా సినిమాను నడిపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది.
నిజమైన ప్రేమకు – ఆకర్షణకు తేడా తెలియక కొందరు ఎలా మోసపోతున్నారు? అక్రమ సంబంధాల కారణంగా జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయన్నది కమర్షియల్ హంగులతో పాటు ఓ సందేశాన్ని రుద్రం కోట సినిమాలో తెరకెక్కించారు డైరెక్టర్ రాము కోన. ఈ కథను గ్రామీణ నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా చెప్పడానికి ప్రయత్నించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఐతే డైరెక్టర్ చెప్పాలనుకున్న సందేశం బాగుంది. కానీ ఇంకా కొంత డెప్త్‌గా ఉంటే బాగుండేది. మొత్తమ్మీద యాక్షన్ ఎపిసోడ్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ చూడముచ్చటగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగు తెరమీదకు వచ్చిన ఓ మంచి సబ్జెక్టు ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అనడంలో సందేహం లేదు.
రేటింగ్ : 3.5 / 5