‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేసిన హీరోయిన్ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయమై స్పందించింది. తనపై వచ్చిన రూమర్స్? డివర్స్ తర్వాత తన జీవితం ఎలా ఉంది? వంటి విషయాల గురించి మాట్లాడింది. విడాకుల తర్వాత జీవితం కష్టంగా మారిందని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని చెప్పింది హీరోయిన్ సమంత. మునుపటి కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలిపింది. ‘కాఫీ విత్ కరణ్ షో’లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో సందడి చేసిన సామ్.. ‘నాగచైతన్యతో విడిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది?’ అని వ్యాఖ్యాత కరణ్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పింది. అంతేకాకుండా కరణ్ ఓ ప్రశ్న అడుగుతోన్న సమయంలో.. “నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?” అని కరణ్ అడగ్గా.. ‘భర్త కాదు మాజీ భర్త’ అని ఆమె ఘాటుగా చెప్పింది. దీనికి కరణ్.. సారీ కూడా చెప్పి ఇంటర్వ్యూ కొనసాగించాడు.
తామిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదని.. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డానని, మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యానని చెప్పింది. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదని, ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి అని చెప్పింది. భవిష్యత్తులో తమ మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదని, మేమిద్దరం విడిపోయినప్పుడు తనపై నెగెటివ్ ప్రచారం జరిగిందని, తాను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయానని, తాను పారదర్శకంగా ఉండాలని అనుకున్నానని చెప్పింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి పెద్దగా బాధ పడలేదని, ట్రోల్ చేసే వారు తన జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు తన దగ్గర సమాధానాలు లేవని చెప్పింది. తాను ఓపెన్‌గా ఉండాలనుకున్నానని, అందుకే విడిపోయిన విషయాన్ని బయటప్రపంచానికి చెప్పానని తెలిపింది. తాము విడిపోయిన కొన్నిరోజులకే ‘ఊ అంటావా’ సాంగ్ ఆఫర్ నాకు వచ్చిందని, ఆ పాట తనకెంతో నచ్చిందని, అందుకే అందులో యాక్ట్ చేశానని తెలిపింది. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, తన లాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించానని సామ్ తెలిపింది. అనంతరం, తాను భరణం కింద 250 కోట్లు రూపాయలు తీసుకున్నానని జరిగిన ప్రచారంపై సామ్ స్పందించింది. సోషల్‌మీడియాలో ఎన్నో పుకార్లు, ప్రచారాలు జరిగాయని, ముఖ్యంగా విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద 250 కోట్లు తాను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని, వాటిని చూసి మొదట షాక్ అయ్యానని తెలిపింది. ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని.. అని ఆమె వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని చెప్పుకొచ్చింది సమంత.