మ‌ల్లాపూర్: బంజారా సమాజం ఆరాధ్య దైవంగా భావించే శీత్లా భవాని వేడుకలు జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో ఆషాఢ మాసంలోని మొదటి మంగళవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పండుగ ద్వారా శీత్లా భవాని దేవి అనుగ్రహంతో పశుసంపద అభివృద్ధి, చిన్నపెద్ద తేడా లేకుండా వ్యాధుల నివారణ జరుగుతుందని బంజారా సమాజం నమ్మకం.

గతంలో బంజారాల జీవన విధానం పశుసంపదపై ఆధారపడి, నిత్యం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సంచరించేది. ఈ సంచారంలో పశువులకు రోగాలు రాకుండా శీత్లా భవాని దేవిని కొలిచేవారు. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఈ వేడుకల్లో బంజారా మహిళలు రంగురంగుల దుస్తులతో ఆటపాటలతో సందడి చేశారు. ఉల్లిగడ్డలు, గుడ్డలు, పప్పు ధాన్యాలు, జొన్నలు, బెల్లం వంటి స్వయంగా తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు.

కుల పెద్దల ఆధ్వర్యంలో జంతుబలి ఇచ్చి, అడవిలోనే సాంప్రదాయ వంటలు తయారు చేసి సమాజ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. పెళ్లి కాని యువతులు ఉయ్యాలలపై ఆటపాటలతో, కేరింతలతో ఉత్సాహంగా ఆడుకున్నారు. ఈ వేడుకలు బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి.

సెలవు ప్రకటించాలని డిమాండ్‌
ఈ సందర్భంగా బంజారా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి తమ విజ్ఞప్తిని సమర్పించాయి. ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే శీత్లా భవాని వేడుకల సందర్భంగా ఒక రోజు సెలవు ప్రకటించాలని కోరాయి. గతంలో చేసిన విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేసిన సంఘ నాయకులు, ఈసారైనా తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు భూక్యా గోవింద్ నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం (టీజీయూఎస్) జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, హైకోర్టు అడ్వకేట్ నునావత్ దేవదాస్ నాయక్, నునావత్ గోవింద్ నాయక్, బదవత్ రాము నాయక్, తిరుపతి నాయక్, పరమేష్ నాయక్, సబావత్ మల్లేష్, మాజీ జడ్పీటీసీ దేవ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శీత్లా భవాని వేడుకలు బంజారా సమాజ సాంస్కృతిక వైభవాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తూ, సమాజంలో ఆధ్యాత్మిక, సామాజిక సమన్వయాన్ని పెంపొందిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *