సుమారు వెయ్యేళ్ల క్రితమే సమసమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సాధువుగా పేరుగాంచారు శ్రీరామానుజాచార్యులు. సమానత్వాన్ని ప్రబోధించిన సంఘ సంస్కర్త, తత్వవేత్త శ్రీరామానుజాచార్యులు గురించి నేటి, భవిష్యత్తు తరాల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను చినజీయర్ స్వామి ఆశ్రమంతో పాటు తెలంగాణ ప్రభుత్వం భుజానికెత్తుకున్నాయి. త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమతామూర్తి Statue of Equality పేరిట బంగారం, వెండి, రాగి, ఇత్తడి, తగరం అనే పంచ లోహాలతో రామానుజాచార్యుల విగ్రహాం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ విగ్రహం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్దది. దీంతోపాటు విగ్రహం లోపలి భాగంలో 120 కిలోల బంగారంతో తయారుచేసిన రామానుజుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర రాష్ట్రాల సీఎంలు, మరికొందరు నేతలను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆశ్రమానికి చెందిన చినజీయర్‌స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చినజీయర్ ఆశ్రమం వారు విరాళాలు సేకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణ ప్రాజెక్టు విలువ సుమారు వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. 1017లో జన్మించిన భగవత్ రామానుజ 120 ఏళ్లపాటు జీవించారని.. అందుకే 120 కేజీల పసిడితో శ్రీరామనుజుల విగ్రహాన్ని పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏడు రోజుల పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపనున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య అతిపెద్ద 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయనున్నారు. ఆచారాలలో భాగంగా 1035 హోమకుండలాలు అగ్ని ఆచారాలు వినియోగిస్తారు. వందలాది మంది ఋత్విక్కులు, సాధువులు ఈ బృహత్ కార్యక్రమానికి హాజరవుతారు.

భగవత్‌ శ్రీరామానుజాచార్యులు 1000 ఏళ్లుగా సమానత్వ మంత్రానికి ప్రసిద్ధి చెందారు. ఈ విగ్రహం, సంబంధిత కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరో 1000 ఏళ్లు అందరికీ గుర్తుండిపోతారు. ఫిబ్రవరి 13న రామానుజుల బంగారు విగ్రహం లోపలి గదిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆవిష్కరిస్తే.. కేసీఆర్, మోదీ కలిసి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట కార్యక్రమం మొదలైంది.

 

By admin