◉ గల్ఫ్ కార్మికులందరిదీ ఒకే కులం… ఒకే వర్గం !
◉ సంఖ్యా బలం నిరూపణకు సర్వే ఒక అవకాశం
◉ గల్ఫ్ కుటుంబాలు నిర్భయంగా వివరాలు వెల్లడించాలి

సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొనాలని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ మంగళవారం గాంధీభవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలకు వెళ్లారని చెబితే.. రేషన్ కార్డు తీసేస్తారని, రైతు బంధు కట్ చేస్తారని, ఇతర సంక్షేమ పథకాలు వర్తించవని బీఆర్ఎస్, బీజేపీ లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ కార్మికులందరిదీ ఒకే కులం.. ఒకే వర్గం అని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు, సమస్యలు విన్నవించుకోవడానికి ‘ప్రవాసీ ప్రజావాణి’ ఏర్పాటు జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సర్వేలో సేకరించిన సమాచారం ఎంతో కీలకం అవుతుందని వినోద్ అన్నారు.

సర్వే ద్వారా గల్ఫ్ కార్మికుల సంఖ్యాబలం తేలితే, వారి సంక్షేమానికి, సురక్షిత వలసలకు సరైన ప్రణాళికలు వేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ లో సేకరించిన గల్ఫ్ కార్మికుల సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్ బయటపెట్టలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వలేదని భీంరెడ్డి విమర్శించారు.

సరిహద్దుల్లోని సైనికుల లాగా గల్ఫ్ కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లు. వీరు పంపే విదేశీ మారకద్రవ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నది. గల్ఫ్ కార్మి ‘కులం’ అని చెప్పుకోవడానికి గర్వపడాలని గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు అన్నారు. విదేశాల్లో నివసిస్తున్నవారి వయస్సు, విద్యార్హత, వృత్తి, ఉద్యోగం లాంటి వివరాలతో పాటు గ్రామం, మండలం, జిల్లాల వారీగా డేటా లభ్యమవుతుంది. వాపస్ వచ్చినవారు గ్రామాలలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ పథకాల రూపకల్పనకు ఈ సమాచారం ఎంతో కీలకం అని శ్రీనివాస రావు అన్నారు.

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

 

‘Swadesam’: Your Trusted Partner for NRI Services !

By admin