జోహానెస్ బర్గ్ (న్యూస్ నెట్‌వర్క్): తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకలను సౌతాఫ్రికాలోని జోహానెస్ బర్గ్ (sandton) లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(TASA ) కన్నుల పండువగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో మారుమోగాయి. రంగురంగు పూలతో బతుకమ్మలు… ఆడపడుచుల ఆటపాటలు… సంప్రదాయ నృత్యాలతో హోరెత్తాయి.మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఆడిపాడి సందడి చేశారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలంగాణ , తెలుగు వాసులు అంతా.. ఒక వద్ద చేరి బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. మగవారు సైతం బతుకమ్మలతో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పండుగకి తెలంగాణ నుంచి కళాకారుల బృందం వచ్చింది. వారి ఆట పాటలతో సౌత్ ఆఫ్రికాలో బతుకమ్మ పండగ మరింత శోభని చేకూర్చింది , TASA కరోనా సమయములో ప్రపంచములోనే మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్‌లో బతుకమ్మ పండగలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
సంబురంగా జరిగిన ఈ బతుకమ్మ వేడుకలను టాసా అధ్యక్షులు యెలిగేటి వేణుమాధవ్, వైస్ ఛైర్మన్ తాళ్ళూరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ బండారు మురళి, కోశాధికారి బొబ్బాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాపోలు సీతారామరాజు, టాసా బృందం మొత్తం శ్రమకోర్చి నిర్వహించారు.