▪️తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం’ (TDF).

▪️త్వరలో ఘనంగా TDF 25 ఏళ్ళ వేడుకలు.

హైదరాబాద్: తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం, పునర్నిర్మాణం, సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) ఆవిర్భ‌వించి 25 వ‌సంతాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా TDF సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల లోగోను తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్య‌మంలో TDF పోషించిన కీల‌క పాత్ర‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కొనియాడారు.

ఉత్సవాల ప్రచార పర్వాన్ని ఎమ్మెల్సీ, ప్రొ. కోదండరాం తన నివాసంలో ప్రారంభించారు, దశాబ్దాలుగా తెలంగాణ కోసమే పాటుపడుతున్న TDF సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోవడం తెలంగాణ ప్రజలందరికి గర్వకారణమన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో లోగో ఆవిష్కరించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, టీడీఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ, ఎలెక్ట్ ప్రెసిడెంట్ భరత్ నరవెట్లా, టీడీఎఫ్ ప్రతినిధులు శ్రీని గిలిపల్లి, శ్రవంత్ పోరెడ్డి, శ్రీనాథ్ ముస్కుల, మహేంద్ర గూడూర్, కీర్తి గున్న, తెలంగాణ అధికారుల బృందం పాల్గొంది. లోగో ప్రచారంతో ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్సీ కోదండరాం పాటు టీడీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ డిపి రెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో టీడీఎఫ్ సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను ఘ‌నంగా సన్నాహాలు మొదలు పెట్టామని ఈ సందర్భంగా TDF నాయకులు తెలిపారు.

పుట్టిన గడ్డపై మమకారం వదలని తెలంగాణ బిడ్డల పోరాటం..
ఊరు, వాడ, ఇక్కడ అందరూ సుఖ శాంతుల తో బతకాలని, మన పాట, మన మాట, మన ఆస్తిత్వం కలకాలం నిలబెట్టు కోవాలని ఆరాటం..

తెలంగాణ రాష్ట్ర సాధన లో క్రియాశీలక పాత్ర, జై కిసాన్, మన తెలంగాణ బడి, ఆరోగ్య సేవ, వనిత చేయూత పథకాల ద్వారా సేవలు, మన సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, కృష్ణా జలాల పంపిణీ, విద్యా రంగంలో సంక్షోభంపై జన చైతన్య సదస్సులు, నిర్వహిస్తూ సాగింది. ఇరవై ఐదేళ్ల తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రస్థానం.

ఇక ముందూ మీతో మేమున్నామని అభివాదం. అమెరికా పర్యటన సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇరవై ఐదేళ్ల వార్షికోత్సవ లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

అప్పుడు ఉద్యమం కోసం.. ఇప్పుడు అభివృద్ధి కోసం..

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు తెలంగాణకు అవసరమైన ప్రతీసారీ అన్ని రంగాల్లో అండగా నిలుస్తుంది TDF, వ్యవసాయంలో ఆధునిక మెలకువల్ని మన రైతాంగానికి చేరవేయడంతో పాటు ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం హెల్త్ క్యాంపులు, తెలంగాణ యువత సుస్థిర భవిత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, న్యాయ సేవలు, రూరల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత, విద్య, వైద్య తదితర రంగాల్లో తెలంగాణ సమగ్ర వికాసానికి కృషిచేస్తుంది TDF.

టీడీఎఫ్ ఏర్పాటు సైతం చారీత్రాత్మకమైనది. 1998లో ప్రోఫెసర్ జయశంకర్ సారథ్యంలో అమెరికా వచ్చిన ప్రతినిధి బృందం నీళ్లు, నిధులు, నియామకాలు, విద్యా, ఉద్యోగాల్లో సీమాంద్ర పాలనలో ఎదురవుతున్న వివక్షతలు, అంతిమంగా రాజ్యాధికారం, స్వయం పాలనే వీటికి పరిష్కారాలుగా పేర్కొన్న సందర్భం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటుకు ప్రేరణగా నిలిచింది. 1999లో అమెరికాలోని న్యూయార్క్ వేదికగా తెలంగాణ వలస పాలన విముక్తి, తెలంగాణ ప్రజలకు నిరంతరం అండగా ఉండడం కోసం ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఏర్పాటు చేసారు. తొలి దశ ఉద్యమం తర్వాత ప్రజల గుండెల్లో మాత్రమే గూడుకట్టిన తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షని రగిలించి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని సవివరంగా వివరించి వారిని ఉద్యమ కార్యోన్ముఖులుగా చేసే ప్రయత్నంలో భాగంగా ఆలోచనల కలబోతగా, థింక్ టాంక్ గా ఉండాలన్న సదాశయంతో ఏర్పడింది టీడీఎఫ్. నాటి నుండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ప్రజల కోసం వారి మేలు కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రైతుల కోసం జైకిసాన్, విద్యారంగ రూపురేఖలు మార్చేలా మన తెలంగాణ బడి, మహిళలకు వనితా చేయూత, ఆరోగ్య రంగంలో ఆరోగ్య సేవ, ఆర్ట్స్ ఆండ్ కల్చర్ రంగలోనూ వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తూ దేశంలో, ప్రపంచంలో తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్దే ఏకైక ఎజెండాగా నిరంత‌రం కృషి చేస్తూనే వుందని ఈ సందర్భంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వాహకులు తెలిపారు. ఈ తరుణంలో త్వరలో TDF సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

 

By admin