అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ రజతోత్సవ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా):
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) యూఎస్ఏ తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సిల్వర్ జూబ్లీ కన్వెన్షన్‌ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా, ‘టీడీఎఫ్ – పొలిటికల్ ఫోరం’ ఆధ్వర్యంలో “ఎడ్యుకేషన్ ఇన్ ఫోకస్” (విద్యా రంగంపై దృష్టి) అనే అంశంపై ఒక కీలకమైన రౌండ్‌టేబుల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం ఆగస్టు 9, 2025న, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో జరగనుంది. తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ చర్చాగోష్టిలో లోతుగా చర్చించనున్నారు.
ఈ ముఖ్యమైన సమావేశానికి తెలంగాణకు చెందిన పలువురు విద్యావేత్తలు, నిపుణులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్య వక్తలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఏఎస్), మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఎ. వెంకట్ రెడ్డి, సాంకేతిక విద్య మాజీ డైరెక్టర్, డాక్టర్ ఎం.వి. రెడ్డి (రిటైర్డ్ ఐఏఎస్), టీడీఎఫ్-బోర్డ్ ఆఫ్ ట్రస్టీ డాక్టర్ గోపాల్ రెడ్డి గాదె ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమానికి కవిత నెల్లుట్ల మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. పాకాలా లోకల్, పీకాక్ రెస్టారెంట్స్ ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండగా, పలు ప్రముఖ మీడియా సంస్థలు మీడియా పార్టనర్లుగా ఉన్నాయి. 1999లో స్థాపించబడిన టీడీఎఫ్, తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులను భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.