★ నాడు ఎన్నారై మంత్రిగా విఫలమైన కేటీఆర్
★ నేడు గల్ఫ్‌పై కపట ప్రేమతో, కొత్త నాటకం షురూ
(నంగి దేవేందర్ రెడ్డి, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్)
బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో… వలస కార్మికులను రెచ్చగొట్టి వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలేసి, నట్టేట ముంచిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత అసలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరమే లేదని, అక్కడ ఉన్నవారు వాపస్ రావాలని కొత్త నాటకానికి తెర లేపారు. నాడు ఎన్నారై మంత్రి హోదాలో 2016 జూలై 17న హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నారై పాలసీ సమావేశంలో ప్రకటించిన హామీలను అమలు చేయకుండా కేటీఆర్ ఒక విఫల ఎన్నారై మంత్రిగా చరిత్రలో మిగిలిపోయాడు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి మాట ఇచ్చిన కేటీఆర్ నిస్సిగ్గుగా తన వైఖరిని మార్చుకున్నాడు.
తమ పాలనలో వలసలు తగ్గాయని, తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయని ఆధారాలు, డేటా లేని అసంబద్ధ వాదనను కేసీఆర్, కేటీఆర్ లు తెరమీదకు తెచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో ప్రచారం చేయించారు. హైదరాబాద్ లో నిర్మాణ రంగంలో పని చేయడానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. ఇక్కడే ఉపాధి ఉంది, కాబట్టి గల్ఫ్ దేశాలకు వెళ్లడం అవసరం లేదనే కొత్త వాదన కూడా లేవనెత్తారు. వ్యవసాయానికి నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వలస వెళ్లడం ఎందుకనే ధోరణి కనబర్చారు. వలస అనేది పౌరుల హక్కు అనే విషయాన్ని విస్మరించారు. చట్టబద్ధ, సురక్షిత వలసలకు ప్రభుత్వ పరంగా మద్దతు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు.
ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి సాగుబడి కష్టంగా మారడంతో సొంతూరులో ఉండలేక బతుకుదెరువు కోసం ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు… అనే తప్పుడు వాదనను ఇప్పుడు కేటీఆర్ తలకెత్తుకున్నాడు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు, ఫిర్యాదుల స్వీకరణకు ‘ప్రవాసీ ప్రజావాణి’ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు, సమగ్ర ఎన్నారై పాలసీ రూపకల్పన కొరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్ చేపట్టిన ‘గల్ఫ్ భరోసా’ సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక కేటీఆర్ తప్పుడు వాదనను తెరమీదికి తెస్తున్నాడు.
ఉవ్వెత్తున ఎగిసిన రాష్ట్ర సాధన ఉద్యమంలో రగిల్చిన ‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’ నినాదం చాలా కీలకమైనది. ఉద్యమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నాయి. సకల జనులతో కలిసి కదం తొక్కాయి. స్వరాష్ట్రం సిద్దించడంలో వారి పాత్ర కూడా ప్రముఖం. తెలంగాణ ఉద్యమ కాలంలో, బతుకమ్మ, బోనాలు, దసరా వంటి పండుగలను దుబాయి (యూఏఈ), సౌదీ, కువైట్, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలలో నిర్వహిస్తూ.. ఉద్యమ ఆవేశాన్ని, ఆత్మగౌరవాన్ని వెలిగించడంలో ప్రవాస తెలంగాణ వాసులు విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా పాటల ద్వారా ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ వంటి అంశాలను ప్రజల్లో బోధిస్తూ ఉద్యమం పట్ల ప్రజలలో స్పూర్తి కలిగించారు.
గల్ఫ్ వలసలతో అభివృద్ధి వైపు ప్రయాణం.. అనే భ్రమ కల్పించి వలస కార్మికుల జీవితాలను విధ్వంసం చేసిన ఘనత కేసీర్, కేటీర్, కవిత లకు దక్కుతుంది. కేసీఆర్ పదేళ్ల పాలన గల్ఫ్ కార్మికులకు ఒక దగా, ఒక మోసం, ఒక వంచన, వెరసి ఒక మానవత్వం లేని ప్రవర్తన లను మిగిల్చింది.
తెలంగాణ లోని మూడు రకాల వలసలకు సూచికలు పాతాళం, భూమి, ఆకాశం. బొగ్గుబాయి (స్వరాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వలస – భూమి లోపల పాతాళంలో పని), బొంబాయి (పక్క రాష్ట్రనికి అంతర్గత వలస – భూమిపై పని), దుబాయి (ఆకాశ మార్గంలో గల్ఫ్ దేశాలకు వలస)
కేసీఆర్, కేటీఆర్, కవిత అనే మూడు శని గ్రహాలు గల్ఫ్ కార్మికులను ఆశల పల్లకిలో ఉంచి నట్టేట ముంచారు. ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావులు తమ హయాంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించని రెండు దరిద్రపు గ్రహాలుగా చెప్పుకోవచ్చు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపులు కోసం నిరీక్షణ ఒక మోసంగా మిగిలిపోవడం చెప్పరాని బాధ. పదేళ్లలో రెండువేల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణించినా… వారిని ఏ విధంగానూ ఆదుకోవడానికి కనికరం చూపని కర్కశకుడు కేసీఆర్. రాష్ట్రం ఏర్పాటయ్యాక వరుసగా నాలుగు బడ్జెట్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. శాసనసభ ఎన్నికలకు వెళ్లేముందు 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐదవ బడ్జెట్ ప్రకటిస్తూ ఎన్నారై సంక్షేమం పేరిట రూ.100 కోట్లు కేటాయించినట్లు మాటలు చెప్పింది. కానీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ విషయంలో కేసీఆర్ అయిష్టంగా ఉన్నాడని చెప్పి ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఉన్నప్పుడు తప్పించుకున్నాడు. తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరాడు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచాడు కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి! దుబాయిలో నిజమైన బతుకమ్మ వేడుకల నుంచి బుర్జ్ ఖలీఫాపై కోటి రూపాయలు ఖర్చు చేసి లేజర్ బతుకమ్మ ప్రదర్శన చేయడం దాకా ‘ఎదిగిన’ కవిత కూడా ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విశేష పాత్ర వహించిన గల్ఫ్ కుటుంబాలతో సహా ప్రవాస తెలంగాణీయులు అందరూ దాదాపు అసంతృప్తికి గురయ్యారు. వారిని ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం మాతృభూమికి ఆహ్వానించలేదు. తగిన గుర్తింపు ఇవ్వలేదు. వారు ఒక అభినందనకు, గౌరవానికి కూడా నోచుకోలేదు. గల్ఫ్ కార్మికులు, వారి బాగోగులు చూసిన సంఘాలను మాత్రమే కాదు, ఉద్యమంలో ఉపయోగపడ్డ ఎన్నారైలు ఎవ్వరినీ తెలంగాణ ప్రభుత్వం గౌరవించలేదు. ప్రపంచ తెలుగు మహాసభలకు మాత్రం టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి లకు అనుబంధంగా ఉన్న ప్రవాసీలను, మరి కొందరిని విదేశాల నుంచి ప్రభుత్వ ఖర్చుతో ఆహ్వానించారు.
గల్ఫ్ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్, కవిత తో పాటు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావులు మాట తప్పారు. ఈ అయిదుగురు గల్ఫ్ కార్మికులను నమ్మించి గొంతు కోశారు. వారి బతుకులతో ఆడుకున్నారు. ఈ నేతల ముసుగులు తొలిగిపోయాయి. పెట్టుకున్న భ్రమలు పటాపంచలయ్యాయి. పూడ్చలేని నష్టం చేసిన ఆ అయిదుగురూ ‘గల్ఫ్ ద్రోహులు’ గా చరిత్రలో నిలిచిపోయారు. ప్రజల్లో ఆరాధ్యులుగా వెలుగాల్సిన ఈ అయిదుగురు అధములుగా, గల్ఫ్ కుటుంబాల దృష్టిలో విలన్లుగా దిగజారిపోయారు. ఇది ఖచ్చితంగా వారి స్వయంకృతం.
2023 నవంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాల నుంచి జీరోకు పడిపోయి బలహీనమైంది. క్యాడర్ నిరుత్సాహంలో ఉంది. ఆ ప్రభావంతో విదేశాలలో విస్తరించిన బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కూడా నిర్వీర్యం అయింది. తెలంగాణ జాగృతి అన్ని శాఖలను రద్దు చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత అంతకు ముందే ప్రకటించారు. జాగృతి ప్రవాసి విభాగాలు కూడా రద్దయ్యాయి. నిజాయితీ, నిబద్ధత, సరైన సంస్థాగత నిర్మాణం, బలమైన పునాదులు లేకపోవడంతో అవి తమ ఉనికిని కోల్పోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గల్ఫ్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతున్న విషయాన్ని 2023 నవంబర్ లో గమనించిన కేసీఆర్, కేటీఆర్ లు ఎన్నికలకు వారం రోజుల ముందు నష్టనివారణ చర్యలకు దిగారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని, అందులో గల్ఫ్ కార్మికులను కూడా చేరుస్తామని కామారెడ్డి సభలో కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట రోడ్ షో లో మాట్లాడిన కేటీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి రైతు బీమా మాదిరిగా గల్ఫ్ బీమా అమలు చేస్తామని అన్నారు. ఐతే, ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ అంశం ప్రస్తావించకుండా సభల్లో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన మాటలను ప్రజలు పెద్దగా విశ్వసించలేదు గానీ చివరికి తమ వైఖరి మార్చుకునే స్థితిలోకి నెట్టబడ్డారు.
‘గల్ఫ్ ఓటు బ్యాంకు అనేది ఒక చిన్న సమూహం, దాని ప్రభావం పరిమితమైనది’ అని తండ్రీ కొడుకులు నమ్మారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకులాగా అది ఒక్కతాటిపై ఉండదు అని వీరు అనుకున్నారు. గల్ఫ్ ఓటర్లు పార్టీలుగా విడిపోయి ఉన్నారనే అభిప్రాయం కలిగిన కేసీఆర్, కేటీఆర్ లు గల్ఫ్ అంశాన్ని మొదట లైట్ గా తీసుకున్నారు. ఎప్పుడైతే గల్ఫ్ కుటుంబాల ఓట్లు నిర్ణయాత్మకం అవుతున్నాయని గ్రహించారో, తమ గెలుపు ప్రశ్నార్థకం అవుతున్నదన్న ఒత్తిడికి, ఓటమి భయానికి గురయ్యారో అప్పుడు గల్ఫ్ అంశంపై కేసీఆర్, కేటీఆర్ లు తప్పని పరిస్థితిలో స్పందించారు.
కేసీఆర్ తన టెలిఫోన్ సంభాషణల్లో గల్ఫ్ కార్మికులను తిట్టిపోశాడు. కరోనా సమయంలో క్వారంటైన్ కు డబ్బులు వసూలు చేశాడు. పునరావాసం, పునరేకీకరణ సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదు. ఇలాంటివి ఎన్నో కలిసి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవి చూసింది.
- నంగి దేవేందర్ రెడ్డి,
తెలంగాణ స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్,
మొబైల్: +91 96661 23419
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/

https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/