హను కోట్ల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నటించిన చిత్రం `ది డీల్‌`. ఆయన ఇప్పటికే ఈటీవీలో `మాయాబజార్` సీరియల్ 150 ఎపిసోడ్స్ చేశారు. పలు యాడ్స్ చేశారు. ఈ మూవీతో ఆయన వెండితెరకు దర్శకుడి పరిచయ‌మయ్యారు. సిటాడెల్‌ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్‌ అనిత రావు సమర్పణలో హెచ్‌ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఇందులో చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ తాజాగా (అక్టోబర్‌ 18) న విడుదలైంది. సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
భైరవ్ (హను కోట్ల) అనే వ్యక్తి యాక్సిడెంట్ త‌ర్వాత గ‌తం చాలా వ‌ర‌కు మ‌రిచిపోయి.. తన భార్య లక్ష్మి (ధ‌ర‌నీ ప్రియ)ని గుర్తు చేసుకుని వెతుకుతాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆమె అతనిని కాకుండా, మరొకరిని తన భర్తగా చూపిస్తుంది. భైరవ్ కు ఈ పరిణామం షాక్ గా ఉంటే, అతను తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటాడు. తన స్నేహితుడు గిరి తనను చంపడానికి ప్రయత్నించిన విషయం కూడా గుర్తుకు వస్తుంది. అదే సమయంలో, అతను లక్ష్మి వేరే వ్యక్తితో ఉంటుందని అనుమానిస్తాడు. భైరవ్ తన మెదడు మళ్లీ సరిగా పని చేయడంలేదని డాక్టర్ చెప్పినప్పుడు, అతనికి నిజాలు కనుగొనడానికి కొంత సమయం పడుతుంది. ఆపై అతను గిరి, భైరవ్ ను పరీక్షించడం ప్రారంభిస్తాడు, చివరికి తన ఇంటిలోనే వారు నివసిస్తున్నారని తెలుసుకుంటాడు.

భైరవ్ తన ఇంటికి తిరిగి వెళ్లి అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అతనికి లక్ష్మి తన భార్య అని అనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆమెను బ్లాక్‌మెయిల్ చేయిస్తున్నాడని తెలుసుకుంటాడు. అతను నిజాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు, కానీ లక్ష్మి తనతో మాట్లాడడం సురక్షితం కాదని అంటుంది. తర్వాత వాళ్లిద్దరూ భైరవ్ పై దాడి చేస్తారు, అతని మెదడు పూర్తిగా దెబ్బతినడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. లక్ష్మి ఆ గ్యాంగ్ లో చేరడానికి గల కారణం ఏమిటి? భైరవ్ ను చంపడానికి వారి ప్రణాళిక ఏమిటి? భైరవ్, ఇతరులు ఇందును ఎందుకు చంపారు? ఈ డీల్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే థియేట‌ర్‌కు వెళ్లి ‘The Deal’ చూడాల్సిందే.

నటీనటులుః
సినిమాలోని ప్ర‌ధానమైన భైరవ పాత్రలో డా. హను కోట్ల బాగా చేశాడు. సినిమా మొత్తం త‌న భుజాల‌పై మోశాడు. హీరోయిజానికి పోకుండా సింపుల్‌గా కనిపిస్తూ కథని మలుపు తిప్పిన తీరు బాగుంది. పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఆయన చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. ఇక‌ ఇందు పాత్రలో నటించిన సాయి చందన ఇన్నోసెంట్‌గా, ధైర్యంగా, ఇతరులకు హెల్ప్ చేసే గుణంతో న‌ట‌న‌లో ఆకట్టుకుంటుంది. తను ఒంటరి అనేది, అమ్మ సెంటిమెంట్‌ సీన్లలో గుండెని బరువెక్కించింది. ఇక రావు పాత్రలో రఘు కుంచె హుందాగా చేశాడు. తనదైన నటనతో మెప్పించాడు. రవి ప్రకాష్‌ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. లక్ష్మి పాత్రలో ధరణి ప్రియా సైతం అదరగొట్టింది. ఆమె పాత్రలో ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. రావు కుమారుడుగా మహేష్‌ పవన్‌ చివర్లో ఇచ్చిన ట్విస్ట్ హైలైట్‌. కాసేపుకనిపించినా ఆకట్టుకున్నాడు. ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన‌ ర‌ఘు కుంచె, మ‌హేష్ య‌డ్ల‌ప‌ల్లి, గిరి, వెంక‌ట్ గోవ‌డ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నీషియన్లుః
సినిమాకి ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం న‌చ్చుతుంది. బీజీఎం ఆక‌ట్టుకుంటుంది. శ్రవణ్‌ కటికనేని ఎడిటింగ్ ప‌ర‌వాలేదు.  సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ బాగుంది, ఫ్రేమింగ్ బాగా సెట్ట‌యింది. ఇంకా క్వాలిటీగా చేయోచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతలో ప‌ర‌వాలేద‌నిపించాయి.

విశ్లేషణః
ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ. దర్శకుడు సాధార‌ణ కథను ట్విస్ట్ లతో రాసుకుని తెర‌కెక్కించిన‌ తీరు బాగుంది. ట్విస్ట్ లు సినిమాకి హైలైట్. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌ సుఫారీ తీసుకుని ఆమె హత్యకు చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్‌, అనంతరం ట్విస్ట్ లు ఆకట్టుకునే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్‌ పార్ట్ ని పోషిస్తుంది. ఓ వైపు హీరోగా నటిస్తూ సినిమాని రూపొందించడం పెద్ద టాస్క్. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఈ మూవీ ద్వారా మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.

ఫస్టాఫ్‌ అంతా హీరో యాక్సిడెంట్‌ తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మి మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతున్నాయి. ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.

సెకండాఫ్‌ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుంటుంది. ఇందుని చంపాలనుకుంటున్నది ఎవరు? ఇంతకి అసలు ఇందు ఎవరు? అనే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌ పాయింట్స్. అయితే సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్ ల పరంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే సినిమాని నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్‌ మిస్‌ అయ్యింది.

ప్రారంభం నుంచి స్లోగా, సాగదీసినట్టుగా సాగుతుంది. ఎక్కడా వేగం కనిపించింది. కానీ ట్విస్ట్ లు కొంత రిలీఫ్‌నిస్తాయి. అమ్మ సెంటిమెంట్‌ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. ఫ్యామిలీతో క‌లిసి ఈ వీకెండ్‌లో థియేట‌ర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా.

రేటింగ్: 3 / 5

 

By admin