జనజీవితాలతో పెనవేసుకుపోయిన పాత్రికేయ రంగమూ పెనుమార్పులకు లోనవుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టే సమాచార రంగమూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎదుగుతున్న తరాల ఆసక్తులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా ఆవిర్భవించి జనజీవితాల్లో ఒకటిగా నిలిచింది. ఈ కొత్త మీడియా ప్రజలకు చురుకుగా, వేగంగా సమాచారాన్ని చేరవేస్తోంది. ఈ నేపథ్యంలో చట్టపరిధిలోకి ‘డిజిటల్ న్యూస్’ను చేర్చ అవకాశాలు కనిపిస్తున్నాయి.
డిజిటల్ మీడియాను నియంత్రించే ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. అందులోనే మొదటిసారి డిజిటల్ వార్త సైట్లను చేర్చనున్నట్లు సమాచారం. డిజిటల్ మీడియాలో ఆ సైట్లను భాగం చేస్తూ.. రిజిస్ట్రేషన్ల నిమిత్తం కొత్త చట్ట సవరణను చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఈ సవరణ బిల్లు గనుక ఆమోదం పొందితే.. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వార్తలు అందించే డిజిటల్ సైట్లు చట్ట పరిధిలోకి వస్తాయి. దాంతో ఉల్లంఘనలకు పాల్పడిన వార్తా సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. పెనాల్టీ విధించడం , రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి నిబంధనలు అమలవుతాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియను సమాచార, ప్రసార శాఖ మం త్రిత్వ శాఖ ప్రారంభించింది. దానిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లులో సవరణలు తేనుంది.
ఇక ఈ నిబంధలను అమల్లోకి వచ్చి న 90 రోజుల్లోగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వారు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లుకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉంది. 2019లో కొత్త ఐటీ చట్టం కింద డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నించగా తీవ్ర వివాదాస్పదమైంది. బ్రిటిష్ హయాంలో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ స్థానంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ బిల్లును భారత ప్రభుత్వం తీసుకుచ్చింది. ఇది వార్తా పత్రికలు, ప్రింటింగ్ ప్రెస్‌లను నియంత్రిస్తుంది.
డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎప్పటికప్పుడు.. వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, న్యూస్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎప్పటికప్పుడు న్యూస్ వీడియోలు, టెక్ట్స్ న్యూస్, ఫోటోన్యూస్, లైవ్ కవరేజీ చేస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తరువాత కొత్త మాధ్యమంగా ఆవిర్భవించి ఆన్‌లైన్ ద్వారా ప్రతిక్షణం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న డిజిటల్ మీడియాకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి. డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా ప్రభుత్వం గుర్తించాలి.