• లెక్కలు అడిగితే సస్పెన్షన్లు, కేసుల పేరుతో బెదిరింపులు చేస్తున్నారంటూ సభ్యుల ఆరోపణలు
  • యూనియన్ నిధులపై పారదర్శకత కోరుతున్న మహిళా కార్మికులు
  • ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్: తెలుగు సినీ అండ్ టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలిపై పలువురు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. యూనియన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లెక్కలు, నిధుల వినియోగం, ప్రాపర్టీ వివరాలు అడిగినందుకు తమను అవమానిస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, పోలీసు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సభ్యులు.. అనంతరం హైదరాబాద్‌లో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వెల్లడించారు.

‘ప్రశ్నిస్తే అవమానిస్తున్నారు’

ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు రేణుక, శైలజ, భారతమ్మ, ఆదిలక్ష్మి, అరుణ తదితరులు మాట్లాడుతూ అధ్యక్షురాలు లలితపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఓట్లతో అధ్యక్షురాలిగా ఎన్నికైన అనంతరం లలిత తమ పట్ల గౌరవంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. యూనియన్ సమావేశాల్లో లేదా ఇతర సందర్భాల్లో సమస్యలపై ప్రశ్నించినప్పుడు మీడియా ముందే చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్‌లోని సభ్యులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్షురాలిపై ఉందని, అయితే తమను కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. కారణం లేకుండా తనకు నచ్చని సభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఏదైనా సభ్యుడు తప్పు చేస్తే అధ్యక్షురాలు, కార్యదర్శి, క్యాషియర్, కమిటీ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని, తప్పు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అన్నారు. కానీ అధ్యక్షురాలు తనకు నచ్చిన విధంగా ఏకపక్షంగా సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదని ఆరోపించారు.

పదేళ్ల ఆర్థిక లెక్కలు చూపించాలని డిమాండ్

యూనియన్‌కు సంబంధించిన ఆస్తులు, నిధులు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి వివరాలు సభ్యులకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. యూనియన్‌కు సంబంధించిన ప్రాపర్టీ వివరాలు అడిగినప్పుడు సరైన లెక్కలు, పత్రాలు చూపకుండా.. ‘‘అక్కడ బిందె ఉంది, ఇక్కడ గ్లాస్ ఉంది, అక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అదిగో ఒక కుర్చీ ఉంది.. ఇవే ప్రాపర్టీ’’ అంటూ ఎగతాళిగా సమాధానం ఇస్తున్నారని సభ్యులు ఆరోపించారు. గత పదేళ్లుగా యూనియన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పూర్తి లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదాయం ఎంత వచ్చింది? సభ్యుల నుంచి ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు? ఇతర మార్గాల్లో వచ్చిన నిధులు ఎంత? వాటిని ఏ విధంగా ఖర్చు చేశారు? యూనియన్ పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు, స్థలం తదితర వివరాలు ఏమిటి? అనే అంశాలపై పూర్తి స్థాయిలో లెక్కలు చూపించాలని కోరారు. యూనియన్ సభ్యులు చెల్లిస్తున్న చందాలు, ఇతర రూపాల్లో సమకూరుతున్న నిధులు ఎలా వినియోగించబడుతున్నాయో సభ్యులకు స్పష్టత ఉండాలని అన్నారు. తమ కష్టార్జితంతో చెల్లిస్తున్న డబ్బుకు లెక్కలు అడగడం తప్పు కాదని పేర్కొన్నారు.

‘ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు’

యూనియన్ నిబంధనల ప్రకారం అధ్యక్షురాలు, కార్యదర్శి, క్యాషియర్‌తో పాటు కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సభ్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అధ్యక్షురాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కమిటీతో చర్చించకుండా, కమిటీ ఆమోదం లేకుండానే ప్రశ్నించిన సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల యూనియన్‌లోని సభ్యుల మధ్య విభేదాలు మరింత పెరుగుతున్నాయని, తమ ఉపాధిపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘పనులు ఇవ్వొద్దంటూ ఒత్తిడి’

తమను ప్రశ్నించినందుకు కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడక్షన్ చీఫ్‌లకు ఫోన్లు చేసి సంబంధిత సభ్యులకు పనులు ఇవ్వవద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని మహిళా కార్మికులు ఆరోపించారు. రోజువారీ ఉపాధిపై ఆధారపడి జీవించే తమకు పని దొరకకపోతే కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని తెలిపారు. యూనియన్‌లోని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన పరిస్థితిలో పోలీసు ఫిర్యాదులు, కేసుల పేరుతో సభ్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే హక్కును కూడా తమకు లేకుండా చేస్తున్నారని, యూనియన్ వ్యవహారాలపై సభ్యులు ప్రశ్నిస్తే బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా కష్టార్జితానికి లెక్క అడుగుతున్నాం’

తమ జీవన పరిస్థితులను కూడా మహిళా కార్మికులు వివరించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రొడక్షన్ పనుల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. చిన్న పిల్లలను ఇళ్ల వద్ద వదిలి పనులకు వస్తున్నామని, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నామని తెలిపారు. ఏడాదికి ఒక్కో సభ్యురాలు రూ.5,000 చొప్పున యూనియన్‌కు చందా చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తంతో పాటు ఇతర రూపాల్లో యూనియన్‌కు వచ్చే నిధుల వినియోగంపై లెక్కలు అడుగుతున్నామని స్పష్టం చేశారు. ‘‘మేము కష్టపడి సంపాదించిన డబ్బుకు లెక్క అడుగుతున్నాం. లెక్కలు అడిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయడం, పనులు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం?’’ అని వారు ప్రశ్నించారు. రోజువారీగా వచ్చే పరిమిత ఆదాయంతోనే పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలను తీర్చుకుంటున్నామని చెప్పారు. తమపై సస్పెన్షన్ లేదా పని లేకుండా చేసే చర్యలు తీసుకుంటే కుటుంబాలపై నేరుగా ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు

యూనియన్ అధ్యక్షురాలు లలిత వ్యవహారశైలి, తమపై జరుగుతున్న ఒత్తిళ్లు, బెదిరింపులు తదితర అంశాలపై సభ్యులు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. యూనియన్‌లో తమకు ఎదురవుతున్న సమస్యలపై చట్టపరంగా కూడా పరిష్కారం లభించాలని విజ్ఞప్తి చేశారు.

ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

యూనియన్‌లో నెలకొన్న వివాదాన్ని మరింత ముదరకుండా వెంటనే పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్, చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు జోక్యం చేసుకోవాలని సభ్యులు కోరారు. యూనియన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, ప్రాపర్టీలు, స్థలం కొనుగోలు తదితర అంశాలపై పారదర్శకంగా పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించి, ఎవరి ఉపాధికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా యూనియన్ నిబంధనల ప్రకారం కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకునేలా చూడాలని, సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేయకుండా తగిన విధానాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్‌లో పారదర్శకత, జవాబుదారీతనం నెలకొల్పడంతో పాటు మహిళా కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాలని వారు కోరారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *