▪️ రఘు మాస్టర్ అధ్యక్షుడయ్యారన్న ప్రచారం అవాస్తవమన్న అసోసియేషన్
▪️ చట్టప్రకారం రఘు మాస్టర్‌పై సుమలతదే విజయం
▪️ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం
▪️ సెప్టెంబర్ 13న జరగాల్సిన జనరల్ బాడీ సమావేశంపై కూకట్‌పల్లి కోర్టు మధ్యంతర ఇంజంక్షన్
▪️ కొత్త సభ్యుల నమోదు కొనసాగిస్తామని స్పష్టం

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. అసోసియేషన్ పేరుతో నకిలీ పత్రాలు, లెటర్‌హెడ్లు, ముద్రలు ఉపయోగించడాన్ని నిరోధించడంతో పాటు, సెప్టెంబర్ 13న నిర్వహించతలపెట్టిన జనరల్ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లిలోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం వి.వి. సుమలతా దేవి అధ్యక్షతన 2025–2027 కాలపరిమితికి ఎన్నికైన కార్యవర్గమే చట్టబద్ధంగా కొనసాగుతోందని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే కొందరు వ్యక్తులు అసోసియేషన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ముందస్తు నోటీసులు లేకుండానే సమావేశం?
బైలా నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆగస్టు 30న కొందరు అనధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. అంతేకాకుండా అసోసియేషన్ అధికారిక ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు ఫోర్జరీ లేఖలు పంపి బ్యాంక్ ఖాతాల సంతకాలను మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. సభ్యుల సంక్షేమం కోసం కేటాయించిన సుమారు రూ.4 కోట్ల నిధులు, అలాగే అసోసియేషన్ భవిష్యత్తును కాపాడేందుకు తక్షణ న్యాయపరమైన జోక్యం అవసరమని పిటిషనర్ తరఫు కోర్టుకు వివరించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 13న ఇందిరానగర్‌లోని హోటల్ అనుపమలో మరో జనరల్ బాడీ సమావేశం నిర్వహించేందుకు ప్రతివాదులు ప్రయత్నిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సెప్టెంబర్ 13 సమావేశానికి కోర్టు బ్రేక్
పిటిషనర్ సమర్పించిన సాక్ష్యాధారాలు, పోలీస్ ఫిర్యాదుల కాపీలను పరిశీలించిన కూకట్‌పల్లి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కావ్య జాడ, ప్రతివాదుల చర్యలపై ప్రాథమికంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.

రాఘవేంద్ర, వై. మెహర్ బాబాతో పాటు ఇతర ప్రతివాదులు సెప్టెంబర్ 13న ఎలాంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించకూడదని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన ముద్రలు, లెటర్‌హెడ్లు, మినిట్స్ బుక్, సంతకాలు అనధికార వ్యక్తులు ఉపయోగించకుండా నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. బ్యాంకులు, ఇతర అధికారిక సంస్థలకు అసోసియేషన్ పేరుతో ఎలాంటి లేఖలు రాయకూడదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

“మాదే చట్టబద్ధమైన కార్యవర్గం”
కోర్టు ఉత్తర్వుల అనంతరం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు.

అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి మాట్లాడుతూ, 2025–2027 కాలానికి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికైన కార్యవర్గానికే అసోసియేషన్ నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవడం, అధికారిక వ్యవహారాలను నిర్వహించడంపై సంపూర్ణ అధికారం ఉందని స్పష్టం చేశారు.
అనధికారికంగా ఏర్పాటైన కమిటీలు లేదా వ్యక్తులు నిర్వహించే సమావేశాలను నిలిపివేయడంతో పాటు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన సంతకాలను మార్చే ప్రయత్నాలపై కూడా కూకట్‌పల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
అసోసియేషన్ అధికారిక లెటర్‌హెడ్లు, స్టాంపులు, సీల్స్, మినిట్స్ బుక్, సంతకాలను అనధికార వ్యక్తులు ఉపయోగించకూడదని చెప్పారు.

నిధుల రక్షణకు బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్
అసోసియేషన్ నిధులను రక్షించేందుకు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయించినట్లు సుమలతా దేవి తెలిపారు. ఇకపై ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, క్యాషియర్ ముగ్గురి సంతకాలతోనే బ్యాంక్ లావాదేవీలు జరిగే విధంగా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అలాగే లేబర్ ఆఫీస్ (JCL) నుంచి వచ్చిన అధికారిక ఆదేశాలు, పేర్ల జాబితా ఆధారంగానే కొత్త సభ్యుల కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి బ్యాంక్ లావాదేవీలు నిర్వహించడం లేదా అసోసియేషన్ పేరుతో లేఖలు రాయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సభ్యులు అవాస్తవ ప్రచారాలను నమ్మి తప్పుదారి పట్టవద్దని, ఏవైనా సమస్యలు ఉంటే అసోసియేషన్‌లో కూర్చొని చర్చించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఫెడరేషన్‌తో చర్చలు
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్తో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సుమలతా దేవి తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో ఫెడరేషన్ పెద్దల సమక్షంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

“ఎన్నికల్లో ఓడినవారి కుట్ర”
అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు తమపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్‌ల నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు, వారు చేసిన తప్పులను బయటపెడుతున్నామనే భయంతోనే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. బోర్డును దింపేందుకు ప్రయత్నిస్తూ ఫెడరేషన్ మద్దతు తీసుకుంటున్నారని మాకు తెలిసింది. ఫెడరేషన్‌కు, మాకు మధ్య ఎక్కడ మనస్పర్థలు వచ్చాయో ఆత్మపరిశీలన చేసుకుంటూ చర్చలు జరుపుతున్నాం” అని తెలిపారు.

తమ సభ్యులే నిబంధనలకు వ్యతిరేకంగా అసోసియేషన్‌కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం బాధాకరమన్నారు.
“బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికైన మా బాడీ మాత్రమే ఒరిజినల్ బాడీ. సోషల్ మీడియాలో కొందరు రఘు మాస్టర్ ప్రెసిడెంట్ అయ్యారని చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. పెన్నుతో సంతకాలు పెట్టి నలుగురు కలిసి ఒక బాడీని ఏర్పాటు చేసుకుంటే కోర్టులు గానీ, అసోసియేషన్ నిబంధనలు గానీ అంగీకరించవు” అని జనరల్ సెక్రెటరీ అన్నారు.

కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో తమ కార్యవర్గం చట్టబద్ధత మరింత స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్లు, డాన్సర్లు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారిక అసోసియేషన్‌ను మాత్రమే సంప్రదించాలని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

“నకిలీ లెటర్‌హెడ్లపై కోర్టు స్పందించింది”
అసోసియేషన్ క్యాషియర్ ఇజ్రాయెల్ మాట్లాడుతూ, గతంలో కొందరు సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తూ నకిలీ లెటర్‌హెడ్లు తయారు చేసి అసోసియేషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారని ఆరోపించారు. ఈ అంశంపై కూకట్‌పల్లి కోర్టు స్పందించి తగిన న్యాయం అందించిందన్నారు.

అసోసియేషన్ లెటర్‌హెడ్లు, స్టాంప్ పేపర్లు, మినిట్స్ బుకులను ఎవరికి వారు ఉపయోగించకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఫెడరేషన్ పెద్దలు అనిల్‌తో కూడా చర్చలు జరిపామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫెడరేషన్ పెద్దల సమక్షంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి, 2025–2027 రెండేళ్ల కాలపరిమితిలో ఎన్నికైన కార్యవర్గం సజావుగా పనిచేసేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వులతో వివాదానికి త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసోసియేషన్ వర్గాల ప్రకారం, కొత్త సభ్యుల నమోదు ప్రక్రియను కూడా నిబంధనల ప్రకారం కొనసాగించనున్నారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *