యం.ఎస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా సంయుక్త నిర్మాణం
హైదరాబాద్: తెలంగాణ మట్టి వాసనలను ప్రతిబింబించే జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శనివారం ఘనంగా ప్రారంభమైంది. యం.ఎస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా పతాకాలపై ప్రొడక్షన్ నం.3గా ముని శివ, శివమల్లాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిలీప్ సాయి నాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్, దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, నేషనల్ అవార్డు విజేత సతీష్ వేగేశ్న, బిగ్ టీవీ చైర్మన్ విజయ్ వెన్నం హాజరయ్యారు.
దర్శకుడు దిలీప్ సాయి నాయక్‌కు సతీష్ వేగేశ్న, బుల్లెట్‌బండి లక్ష్మణ్ స్క్రిప్ట్‌ను అందజేశారు. హీరో కిట్టు పవన్‌పై చంద్రబోస్ క్లాప్ ఇచ్చారు. ఆర్.పి. పట్నాయక్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. విజయ్ వెన్నం కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ, ‘‘ఈ టీమ్ గురించి నాకు చాలా బాగా తెలుసు. టీమ్‌లోని ప్రతి ఒక్కరిలో ఎంతో ప్రతిభ ఉంది. నిర్మాతలు ముని శివ, శివమల్లాల, బుల్లెట్‌బండి లక్ష్మణ్, సంగీత దర్శకుడు మదిన్ నాకు ఎంతో ఆత్మీయులు. వీరందరూ కలిసి ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సతీష్ వేగేశ్న మాట్లాడుతూ, ‘‘మంచి కథతో వచ్చిన దర్శకుడు దిలీప్‌కు మా శివలిద్దరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఈ చిత్ర బృందం అందరికీ మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ, ‘‘ఈ నిర్మాతలిద్దరూ మంచి సినిమాలు నిర్మిస్తూ పెద్ద నిర్మాతలుగా ఎదగాలి. భవిష్యత్‌లో పదుల కొద్దీ సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో కిట్టు పవన్ మాట్లాడుతూ, ‘‘నేను చాలా చిన్న నటుడిగా ఫోక్ సాంగ్స్ చేసేవాడిని. అలాంటి స్థాయి నుంచి హీరోగా నేను చేస్తున్న ఈ సినిమాకు ఇంతమంది ప్రముఖులు వచ్చి మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి సినిమా అందించడానికి కృషి చేస్తాను’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మదిన్, కెమెరామెన్ జనతా బబ్లూ, నూతన దర్శకుడు కృష్ణకాంత్‌తో పాటు ఫోక్ ఇండస్ట్రీకి చెందిన పలువురు కళాకారులు పాల్గొన్నారు.

