వాషింగ్టన్ డీసీ (న్యూస్ నెట్‌వ‌ర్క్): తెలంగాణ బ‌తుక‌మ్మ పండుగ‌ ఖండాంత‌రాల్లోనూ వైభ‌వంగా సాగాయి. తెలంగాణ డెవల‌ప్‌మెంట్ ఫోరమ్ యూఎస్ఏ వాషింగ్టన్ డిసి చాఫ్టర్ ఆధ్వర్యంలో వర్జీనియాలోని ఆశ్ బర్న్ లో బ్రాడ్ రన్ హైస్కూల్ లో బతుకమ్మ, దసరా వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. టీడీఎఫ్ పూర్వాధ్యక్షురాలు కవిత చల్ల ఆధ్వర్యంలో, వినయ సూరినేని, కల్పనా బోయినపల్లి కన్వీనర్లుగా, జీనత్ కుందురు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన ఈ పండుగకి వర్షాన్ని కూడా లెక్కచేయక వేల సంఖ్యలో అందంగా అలంకరించుకున్న మహిళలు, పిల్లలు, మగవారు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలో దొరికే అంద‌మైన పూలతో పేర్చిన, గౌరమ్మతో అలంకరించిన బతుకమ్మలను మేళ తాళాలతో ఊరేగింపుగా ప్రాంగణానికి డాన్సులతో, తీన్మార్ స్టెప్పులతో తీసుకువచ్చారు. ఆ తర్వాత బతుకమ్మలన్నిటిని ఒకచోట పెట్టి, పాటలు పాడుతూ, పాటకనుగుణంగా స్టెప్పులు వేస్తూ మహిళలు బతుకమ్మ ఆట పాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చక్కటి బతుకమ్మలకు పోటీలు కూడా నిర్వహించి, బహుమతులను పంచి పెట్టారు. ఈ సందర్బంగా జరిగిన దసరా జమ్మి పూజలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ వాషింగ్టన్ డిసి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చిన చాలా మంది తమ కుటుంబాలతో కలసి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అందరూ జమ్మిని ఇచ్చి పుచ్చుకుని ఆలింగనాలు చేసుకుని, బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళలు తెలంగాణ సాంప్రదాయంలో రంగురంగుల వస్త్ర ధారణలో మెరిసిపోతూ, చూడ ముచ్చటగా అలంకరించుకుని రాగా స్కూల్ ఆవరణం అంతా ఒక తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించింది.

ప్రత్యేక అతిథిగా హాజరయిన దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు బతుకమ్మ సంబరాలని ఆనందంగా తిలకించారు. అమెరికా చట్ట సభలకు ఎన్నుకోబడ్డ కొందరు అమెరికన్ చట్ట సభ ప్రతినిధులు, భారత సంతతి వర్జీనియా స్టేట్ డెలిగేట్ సుహాస్ సుబ్రహ్మణ్యంతో సహా పలువురు స్కూల్ బోర్డు సభ్యులు ఈ బతుకమ్మ పండుగలో సందడి చేశారు. తెలంగాణ డెవల‌ప్‌మెంట్ ఫోరమ్ USA అధ్యక్షులు డాక్టర్ దివెష్ అనిరెడి కూతురు దర్పా అనిరెడి వాలంటీర్ చేస్తూ బతుకమ్మలో పాల్గొంది. అమెరికాలోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, తెలంగాణ‌ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

జీనత్ కుందురు నిర్వహణలో ఏర్పాటు చేసిన తెలంగాణా రుచులతో ఫుడ్ స్టాల్స్ లో అందరూ తెలంగాణ రుచులని ఆస్వాదించారు. కల్పనా బోయినపల్లి నిర్వహణలో ఏర్పాటు చేసిన నగలు, బట్టలు, అలంకరణ సామగ్రి లాంటి స్టాల్స్‌లో మహిళలు, పురుషులు చాలా సందడిగా కనిపించారు. మంజువాణి, రవలికల నాట్య బృందం ప్రదర్శించిన బతుకమ్మ, మహిసాసుర మర్ధిని నృత్యరూపకం పలువురిని అలరించింది. నృత్యంలో ఒక ప్రత్యేక పాత్ర ద్వారా ఆకట్టుకున్న వికాస్, సాయి మనోహర్ లు చిన్నారుల నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో సహకరించిన సభ్యులు జీనత్ కుందురు, రామ్మోహన్ సూరినేని, మల్లారెడ్డి, నవీన్ చల్ల, శివాని, షర్మిల, వందన. మంజుషా, ఆశ్వీని, రవి పళ్ళ, హర్ష రెడ్డి, నరేందర్, స్పాన్సర్స్ కి, వాలంటీర్స్ కి, డీసీ వనిత లీడర్షిప్ కి కన్వీనర్ వినయ సూరినేని, కవిత చల్ల, కల్పనా బోయినపల్లి పేరు పేరున కృతజ్ఞతలు తెలియ చేశారు. కోవిడ్ నిబంధనలు తొలగించిన తర్వాత జరిగిన ఈ పండుగకి, ప్రజలు మూడురోజులుగా కురుస్తున్న హరికేన్ అయాన్ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పెద్ద ఎత్తుగా పాల్గొనడం, బతుకమ్మ పండుగ పట్ల అమెరికాలో ఆదరణ పెరుగుతుందనడానికి ఒక మంచి ఉదాహరణ అని నిర్వాహకులు తమ సంతోషాన్ని తెలియచేశారు. చివరగా జరిగిన బతుకమ్మ నిమజ్జనం తర్వాత ఒకరికొకరు సద్దులు, పసుపు, కుంకుమ ఇచ్చి పుచ్చుకున్నారు. హాజరయిన సభ్యులందరికి బతుకమ్మ- దసరా పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ విందు కార్యక్రామాన్ని ముగించారు.

 

 

 

By admin