మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేయ‌డంతో గులాబీ పార్టీలో రాజ‌కీయం మ‌రింతా ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించారు కేసీఆర్. ఈ మేరకు కూసుకుంట్ల విజయం కోసం పనిచేస్తామని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు నర్సయ్య గౌడ్. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ సైనికుడిగా గెలుపు కోసం పని చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదన్నారు. అందరిలాగే తాను కూడా టికెట్ ఆశించానని.. తనకు ఆ హక్కు వుందని కర్నె చెప్పారు. కేసీఆర్ నిర్ణయం అమలు చేయాల్సిన బాధ్యత తమపై వుందని ఆయన పేర్కొన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె చెప్పారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు.

ఇక ఇటీవ‌ల బూర నర్సయ్య గౌడ్ చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన వారు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు… కానీ వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడు టికెట్ అనేది అంత ముఖ్యమైనది కాదని, 6 నెలల పదవి కోసం ఇంత అవసరం లేదని ఆయన విమర్శించారు. వ్యక్తిగత ఆహ్వానాలు, చిల్లర రాజకీయాల కొరకు తాను ఉండనని, తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడని, మిగతా లిల్లీపుట్స్ ను పట్టించుకోను.. అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజాగా మునుగోడు టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేటాయించ‌డంతో బూర నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ తో కేసీఆర్ పిలిపించి మాట్లాడారు. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉండాలంటూ బూర న‌ర్స‌య్య‌కు చెప్ప‌డంతో పాటు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ కోసం సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు.

BREAKINGNEWS APP ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొండి. బిగ్ బ్రేకింగ్ మీ కోసం.
BREAKINGNEWS APP ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొండి. బిగ్ బ్రేకింగ్ మీ కోసం.

 

By admin