- వికసించిన భాషా కుసుమం
- సాహిత్యం పై ఐదు ఎంఫిల్ లు నాలుగు పీహెచ్డీలు
- 11 భాషల్లోకి కథలు నవలలు అనువాదం
- పలు యూనివర్సిటీలలో సిలబస్ గా అతని రచనలు
మానవీయతను చాటే కథాంశాలకు పెద్దపీఠ వేసే కలం ఆయనది..
తెలంగాణ పల్లె ప్రజల జీవన స్థితులను, వారి వ్యధలను ఆవిష్కరిస్తారు..
ఎన్నో కథా సంపుటాలు, నవలలు , వ్యాసాలూ రాశారు. సినిమాలకూ రాశారు. ఎన్నో పురస్కారాలు, అవార్డు లు అందుకున్న ఆ రచయిత తాజాగా అరుదైన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
పెద్దింటి అశోక్ కుమార్ ఒక ఉపాధ్యాయుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట పాఠశాలలొ గణిత ఉపాధ్యాయుడు. కానీ తెలుగు సాహిత్యం పై తనదైన ముద్ర వేసాడు. పాతికేళ్లుగా తెలంగాణ మట్టి భాషలో కథలు నవలలు నాటకాలు రాస్తున్నాడు. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సినిమాలకు మాటలు పాటలు రాస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ మద్రాస్ యునివర్సిటిలలో ఆయన రచనలు పాఠ్యాశాలుగా ఉన్నాయి.
ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీలలో ఐదు ఎంఫిల్ డిగ్రీలు నాలుగు పీహెచ్డీ డిగ్రీలు వచ్చాయి. ఆయన రాసిన జిగిరి నవల పదకొండు భాషల్లోకి అనువాదమైంది. కన్నడ హిందీ భాషల్లోకి కథలు అనువాదమై సంకలనాలుగా వచ్చాయి.
ఎడారి మంటలు నవల ఒక పరిశీలనపై ఎం సాయిరాం మద్రాస్ విశ్వవిద్యాలయంలో, దాడి నవల ఒక పరిశీలనపై ఎం. శారద కాకతీయ విశ్వవిద్యాలయంలో, లాంగ్ మార్చ్ నవల ఒక పరిశీలన పై కే. స్వరాజ్యం కాకతీయ యూనివర్సిటీలో, మాయిముంత కథలు ఒక పరిశీలనపై నర్రా అంజన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో, జిగిరి నవల ఒక పరిశీలనపై గడ్డం లింగరాజు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ డిగ్రీలు పూర్తి చేసారు.
బండారి ప్రేమ్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కే. నర్సింలు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, మీసాల ఉదయ్ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, చల్లా దేవి నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం పై పీహెచ్డీలు పూర్తి చేశారు. అరుదైన ప్రతిభ కనబరిచిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్కు ప్రసంశల వర్షం కురుస్తోంది.