ప్రస్తుత రాజకీయ నాయకుల్లో అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎంల్లో జగన్ ఒక్కరు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కేవలం జగన్ ఇమేజ్ తోనే.. 151 సీట్లతో అఖండ విజయం దక్కింది. నాటి నుంచి ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనే ఆయన నెంబర్ వన్ అనడంలో డౌట్ పడాల్సిన అవసరం లేదంటారు వైసీపీ నేతలు. ఎందుకంటే నవరత్నాల పేరుతో ఇప్పటికే ఎన్నో పథకాలు అందిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను కూడా ప్రవేశ పెడుతున్నారు. మరోవైపు క్రమం తప్పకుండా ఆ పథకాలకు నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు. ఇక రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. కరోనా వైరస్ మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఆయన పథకాలను ఆపలేదు. చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతవ వారిగా ఆయా లబ్ధి దారులకు నగదు అందిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన సంక్షేమ సీఎంగా ముద్ర వేశారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ పథకాలు, ప్రభుత్వ పాలనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది అంటున్నారు. అయితే రాష్ట్రంలో ఆయన క్రేజ్ సంగతి అలా పక్కన పెడితే.. తాజా జగన్ మరో రికార్డు సాధించారు.
దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇది వైసీపీ నేతలు ఇచ్చిన ర్యాంక్ కాదు. ప్రముఖ స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ – 2022 ఫలితాల్లో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. తాజాగా ఆ సంస్థ విడుదల చేసిన జాబితాలో.. ఈ ఏడాది కూడా ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. విభజన తరువాత రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాబితాలో రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ గెలుపొందారు.
ఈ జాబితాలో మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నాలుగో స్థానంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఐదో స్థానంలో నిలిచారు. బెస్ట్ సీఎంల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరో స్థానం సాధించారు. కేసీఆర్ లక్కి నంబర్ కూడా ఆరు అవ్వడం మరో విశేషం. ఇక ఈ జాబితా ఉత్తరప్రదేశ్ సీఎం ఏడో స్థానంలో, మధ్యప్రదేశ్ సీఎం 8వ స్థానంలో, అసోం సీఎం 9వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ సీఎం 10వ స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న జాబితాలో కూడా ఏపీ టాప్‌లో నిలిచింది. సుపరిపాలన విషయంలో ఏపీ ఒక్కటే టాప్-5లో ఉండగా.. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకోలేదు. అయితే ఇప్పుడే కాదు కరోనా సమయంలోనూ.. వివిధ సంస్థలు ఇచ్చిన సర్వేల్లో జగన్ ఉత్తమ స్థానాలనే దక్కించుకున్నారు.