ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్య‌క్షుడు బైరి వెంకటేశం ఆధ్వ‌ర్యంలో 57 ఎస్సీ ఉప‌కులాల ప్ర‌తినిధుల‌తో ఇందిరా పార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద‌ నిర‌స‌న దీక్ష‌.

ఎస్సీ ఉప‌కులాల‌కు బాస‌ట‌గా నిలిచిన‌
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ‌రామ్
బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్
బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
ద‌ళితుల‌న్ని, ఉద్య‌మబిడ్డ‌ల్ని సీఎం మోసం చేశార‌ని, ఒక్క శాతం లేనోడు మ‌న‌ల్ని ఏలుతుండు అని, గుండెకాయ‌లాంటి ముఖ్య‌మైన మంత్రి ప‌ద‌వుల‌న్నీ వారే అనుభ‌విస్తున్నార‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. 17 శాతం ఉన్న‌ ద‌ళితుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని, 57 ఉప కులాలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నార‌ని మోసానికి గుర‌వుతూనే వున్నార‌ని అన్నారు. ఉప కులాల‌కు ఒక మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ద‌ళిత బంధు కోసం అంటూ కేటాయించిన బ‌డ్జెట్ ను సీఎం ద‌ళితుల‌కు ఇవ్వ‌డ‌ని, ఒక‌వేళ కేటాయిస్తే ముక్కు నేల‌కు రాస్తాన‌ని ఈట‌ల స‌వాల్ విసిరారు. ద‌ళిత ఉప కులాల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి తాను ముందుంటాన‌ని అన్నారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ‌రామ్ మాట్లాడుతూ.. 57 ఉప కులాల డిమాండ్స్‌కు సంపూర్ణంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌త్యేక ఆర్థిక సంఘం ఏర్పాటు చేయాల‌న్నారు. విద్య‌, వైద్యానికి దూర‌మైన ఈ ఉప కులాల‌కు న్యాయం చేయాల‌న్నారు. 57 కులాలకు సంబంధించి ఒక పుస్త‌కం తీసుకొస్తే స‌మస్య‌లు ప‌రిష్కారం దిశగా ముందుకెళ్ల‌చ్చ‌న్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు మాట్లాడుతూ.. ద‌ళిత ఉప కులాలకు మ‌ద్ద‌తు ఇస్తూ వారితో పాటు తాను కూడా పోరాటం చేస్తాన‌ని అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెన‌క‌బ‌డి ఉన్న కులాలు ఎదిగిన‌ప్పుడే తెలంగాణ ఉద్య‌మ క‌ల నెర‌వేరుతుంద‌ని అన్నారు. నిజంగా చిత్త‌శుద్ది ఉంటే, ప్ర‌క‌టించ‌డానికి సిద్ద‌మైన రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక‌టి ఉప కులాల‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఉప కులాల‌కు స‌ర్టిఫికెట్‌లు ఇవ్వ‌డం ఇబ్బంది పెడుతున్న అధికారుల‌పై కేసులు పెట్టాల‌ని ర‌ఘునంద‌న్ రావు అన్నారు. ఒక్క‌శాతం లేనోడు మిమ్మ‌ల్ని ప‌రిపాలిస్తుంటే చూస్తూ కుర్చోకుండా మీరంతా చైత‌న్య‌వంతం అవ్వాల‌ని సూచించారు. ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేస్తాన‌ని మోసం చేశాడ‌ని, కేసీఆర్ అహంకారం త‌గ్గాలంటే పోరాటం గ‌ట్టిగా చేయాల‌ని కోరారు.

దళితులలో అత్యంత వెనుకబడిన కులాలు 57 వరకు ఉన్నాయి. మోచీ, హోలియదాసరి, బైండ్ల, చిందోల్లు, మష్టిన్, గోసంగి, డక్కలి, మాలజంగం, సమగర, మాదిగజంగం, బెడబుడగ జంగం, మాలదాసరి, కొలుపుల, మితల్అయ్యవార్లు, మదాసికురువ/మాదారికురువ, మాంగ్, మహార్, మాంగ్ గరోడి, నేతకాని, పాకి, మోటి, తోటి, మెహతర్, బ్యాగరి, చాచాటి, దండాసి, దోర్, దోంబర, పైడి, పానో లాంటి కులాలు విద్య, ఉద్యోగాలు, ఉపాధి ఫలాలు అందక సంచార జీవనాన్ని గడుపుతున్నాయి. దళితులలో మాల, మాదిగలు కాకుండా ఇన్నికులాలు ఉన్నాయా అన్న విషయం కూడా ఈ సమాజంలో చాలా మందికి తెలియదు. ఎస్సీ ఉపకులాలు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఇబ్బందులు తొలగించాలి. ఎస్సీ ఉపకులాలను దళితుల్లో అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దళితబందులో ఎస్సీ ఉపకులాలకు ప్రతి నియోజకవర్గంలో 40 శాతం యూనిట్లు కేటాయించాలి. ప్రభుత్వ గురుకులాల్లో ఎస్సీ ఉపకులాల విద్యార్థులకు అర్హత పరీక్షలు లేకుండా నేరుగా ప్రవేశం కల్పించాలి. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంపై ఆధారపడి బతికే మాంగ్, మహార్, మాంగ్ గరోడి కులస్తుల భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి. ఇప్పటి వరకు చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని ఎస్సీ ఉపకులాలకు రాజ్యసభ సీటు కేటాయించాలి. జనాభా ప్రకారం రాజకీయంగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేక వాటా ఇయ్యాలి. చర్మకార వృత్తిపై ఆధారపడి జీవించే మోచీ, చమార్, సమగర కులస్తులను చేతి వృత్తి దారులుగా గుర్తించి, లెదర్ పార్కులు నిర్మించి ప్రత్యేక సొసైటీ ద్వారా చెప్పుల మార్కెటింగ్​ను ప్రోత్సహించాలి. బైండ్ల పూజారులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని గ్రామదేవతల ఆలయాల్లో పూజారులుగా నియమించి గౌరవ వేతనం ఇయ్యాలి. 2018 లో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మోచీ, బైండ్ల, బెడబుడగ జంగం కులాలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి, అన్ని ఉపకులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇయ్యాలి. అప్పుడే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది.

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్య‌క్షుడు బైరి వెంకటేశం మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాలకు జ‌రుగుతున్న అన్యాయం వివ‌రించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న 57 ఉప కులాల కులాల వారి జీవితాలు అత్యంత వెనుకబడ్డాయ‌ని చెప్పారు. మోచీ, హోలియదాసరి, బైండ్ల, చిందోల్లు, మష్టిన్, గోసంగి, డక్కలి, మాలజంగం, సమగర, మాదిగజంగం, బెడబుడగ జంగం, మాలదాసరి, కొలుపుల, మితల్అయ్యవార్లు, మదాసికురువ/మాదారికురువ, మాంగ్, మహార్, మాంగ్ గరోడి, నేతకాని, పాకి, మోటి, తోటి, మెహతర్, బ్యాగరి, చాచాటి, దండాసి, దోర్, దోంబర, పైడి, పానో లాంటి కులాలు విద్య, ఉద్యోగాలు, ఉపాధి ఫలాలు అందక సంచార జీవనాన్ని గడుపుతున్నాయి. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం దళితుల జనాభా 63 లక్షల 60 వేల 158 ఉండగా ఇందులో మాదిగ కులస్తుల జనాభా 25 లక్షల 9వేల 992(39%)ఉంది. మాల కులస్తులు జనాభా17 లక్షల 5 వేల 448(27%) గా ఉంది. ఎస్సీ ఉపకులాల జనాభా మొత్తం 21లక్షల14 వేల 718(34%) ఉన్నది. గత ప్రభుత్వాలను పక్కనపెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరుటి వరకు ఈ ఏడేండ్లలో.. ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా లబ్దిపొందిన దళితుల యూనిట్ల వివరాలు పరిశీలిస్తే.. 39 శాతం జనాభా ఉన్న మాదిగలు69.1 శాతం యూనిట్లు పొందగా, 27 శాతం జనాభా కలిగిన మాల కులస్తులు 23.5 శాతం యూనిట్లు పొందారు. కానీ 34 శాతం జనాభా ఉన్న ఎస్సీ ఉపకులాలు కేవలం 7.4 శాతం యూనిట్లను మాత్రమే పొందారు. ఇలా ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఉపకులాలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో వారు మరింత పేదలుగానే మిగిలిపోతున్నారు. దళితబందు పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలో వందమందికి కేటాయిస్తే అందులో కేవలం రెక్కల కష్టంపై మాత్రమే ఆధారపడి జీవించే ఎస్సీ ఉపకులాలవారికి ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.. అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మోచి సంఘం అధ్య‌క్షులు రాచ‌ర్ల రాజ్ ద‌శ‌ర‌త్, హోలియ‌దాస‌రి సంక్షేమ సంఘం అధ్య‌క్షులు ఆదిముళ్ల వెంక‌టేష్, బైండ్ల సంఘం అధ్య‌క్షులు ఎదుళ్ల గౌరీ శంక‌ర్, మాష్టిన్ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు బుద్దుల గంగ న‌ర్స‌య్య‌, నాయ‌కులు దంతెన‌ప‌ల్లి స్వామి, గోసంగి సంఘం నీర‌గొండ బుచ్చ‌న్న‌, మ‌ల్లెల సాయి, చిందు హ‌క్కుల పోరాట స‌మిత అధ్య‌క్షులు రాయిల ల‌క్ష్మిన‌ర్స‌య్య‌, ర‌మేష్, మాదశికుర‌వ అధ్య‌క్షులు కుర‌వ విజ‌య్, జ‌య‌రాములు, మాంగ్ కుల సంఘం అధ్య‌క్షులు తుల‌సీదాస్, మిత అయ్య‌ల్వార్ సంఘం అధ్య‌క్షులు మిత‌ల్ భాస్క‌ర్, బెడ బుడ‌గ‌జంగం సంక్షేమ సంఘం నాయ‌కులు క‌త్తి న‌ర్స‌య్య‌, గంగారాం, న‌ర‌హ‌రి, మాల దాస‌రి సంక్షేమ సంఘం అధ్య‌క్షులు ఐల‌య్య‌.. ప‌లు ఉప కులాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

 

By admin