‘అవతార్’.. అదొక సినిమా పేరు మాత్రమే కాదు, అంతకు మించి! అదొక అద్భుత ప్రపంచం! ఆ ఊహాకందని సరికొత్త ప్రపంచంలో ప్రపంచ ప్రేక్షకులు అందరూ విహరించారు. సినిమా చరిత్రలో అవతార్ ఒక మైలురాయిగా నిలువడంలో జేమ్స్ కామెరాన్ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 2009 నాటి “అవతార్” అప్పట్లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ప్రపంచ సినీ చరిత్రలో ఆ మూవీకి మించిన కలెక్షన్ ఈ 13 ఏళ్లల్లో మరే సినిమా కూడా చేయలేకపోయింది. ఏకంగా 3 బిలియన్ డాలర్ల వరకు థియేటర్స్ నుంచి రాబట్టిన ఆ చిత్రానిది తిరుగులేని ప్రపంచ రికార్డు. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ అవతార్-2 గా దాని సీక్వెల్ మనముందుకొచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
పాండోరా గ్రహంలో ఉంటే తనను మనుషులు లక్ష్యంగా చేసుకోవడం వల్ల నావీలకు ఇబ్బందన్న ఉద్దేశంతో హీరో సముద్రాన్ని నమ్ముకుని బతికే మరో జాతి ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ తన కుటుంబంతో కలిసి గుట్టుగా జీవిస్తుంటాడు. ‘అవతార్’కు పాండోరా నేపథ్యం అయితే.. ఈ కథకు సముద్రం కేంద్రంగా మారింది. సముద్ర గర్భంలో వింతలు విశేషాలు.. హీరో పిల్లల విన్యాసాల నేపథ్యంలో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలో విహరింపజేయడానికి కామెరూన్ ప్రయత్నించాడు.
పార్టు వన్ మాదిరిగానే ఇందులోని పాత్రదారులు రామాయణంలో వానరుల్ని పోలిన వేషధారణతో కనిపిస్తారు. వనవాసులది నీలిరంగైతే, జలవాసులది ఆక్వా బ్లూ. నీటిని ఆశ్రయించుకుని బతికే జీవులు, వాటితో మమేకమయ్యి వాటిని అవసరానికి వాడుకునే విధానం అంతా అవతార్ 1లో చూపించిన మాదిరిగానే ఉంది. శత్రువు బాధని అర్ధం చేసుకుని సాయమందిస్తే శత్రుత్వం మాయమైపోయి స్నేహం విరాజిల్లుతుందని ఈ కథలో ఒక నీతిని ప్రబోధించాడు పాయకన్ అనే ఒక సముద్రజీవి ద్వారా.
టైటిల్ మాత్రమే కాదు సినిమాలో భారతీయ ఇతిహాసాల నేపథ్యాలు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. రాముడు వానరుల సాయంతో లంకపై గెలిచినట్టు ఇక్కడ జేక్ సల్లీ జలవాసుల సాయంతో భూలోకవాసులపై గెలుస్తాడు. అలాగే, ప్రహ్లాదుడు-హిరణ్యకశపుడు టైపులో స్పైడర్- అతని తండ్రైన కల్నల్ మధ్య ఒక చిన్న ట్రాక్ నడుస్తుంది. హీరో కుటుంబం జలవాసుల వద్ద తలదాచుకోవడం పాండవులు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో తలదాచుకున్న ఎపిసోడ్ గుర్తొస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో సన్నివేశాలని పోలిన త్రెడ్లు కనిపిస్తూనే ఉంటాయి. ఎంత గొప్ప కథ రాయాలన్నా రామాయణభారతాల్ని దాటి వెళ్లడం కష్టమని అంటుంటారు కొందరు. జేమ్స్ కెమారూన్ కి కూడా తీరు కూడా అలాగే కనిపిస్తోంది ఈ అవతార్ సినిమా ద్వారా. జపమాల కూడా కనిపిస్తుంది. పదమూడేళ్ల క్రితమే ఏదో ఇంటర్వ్యూలో అవతార్ పాత్రలకి నీలిరంగు పులిమి, తోకలు పెట్టడమనేది రామాయణం నుంచే స్ఫూర్తి పొందానని చెప్పాడు. అది పార్ట్ 2 కి కూడా కొనసాగింది. కాన్షియస్ గానో, సబ్ కాన్షియస్ గానో రామయణ మహాభారతాల ఇంఫ్లుయన్స్ లో ఉండే ఈ రెండవ భాగం కథ కూడా రాసుకున్నాడేమో అనిపిస్తుంది.
నిజానికి అవతార్ 2 కథ చాలా చిన్నది. పండోరా గ్రహం మీద కల్నల్ టీం దాడి జరుగుతుంది. ఆ దాడిలో హీరో కుటుంబం చిక్కుకుంటుంది. ఆ కుటుంబ సభ్యులు ఆ దాడి నుంచి తప్పించుకుని ఒక తెగకు చెందిన జలవాసుల వద్ద తలదాచుకుంటారు. వాళ్ల సాయంతో కౄరులైన భూలోకవాసుల్ని ఎదిరించి ఓడిస్తారు. ఈ నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్ విజువల్ గా వండర్. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో సీన్‌లు నెమ్మదిగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఉత్కంఠత పెద్దగా ఏమీ ఉండదు. విలన్ గ్యాంగ్ ఏదో ఒక రోజు హీరో గుట్టు కనిపెట్టడం.. ఆ తర్వాత అతను వారిపై పోరాడి గెలవడం.. ఈ లైన్ చాలా ముందుగానే అర్థమైపోతుంది. ఈ మలుపు కోసం ప్రేక్షకులు కాస్త ఓపికగా ఎదురు చూడాల్సి వస్తుంది. సీన్‌లను కామెరూన్ చాలా తాపీగా నరేట్ చేస్తూ వెళ్లాడు. సముద్రపు అందాలు, అందులో విన్యాసాలు ఒక దశ వరకు బాగానే అనిపించినా.. తర్వాత కొంచెం బోర్ ఫీలింగ్ రావడానికి కారణం రిపీటెడ్ సీన్లే. సముద్ర వింత జీవి హీరో కుటుంబాన్ని రక్షిస్తూ విలన్ల మీద విరుచుకుపడే సీన్‌లు, యాక్షన్ సీన్‌లు గూస్ బంప్స్ ఇచ్చినా.. క్లైమాక్స్ అంత ఈజీగా ముగియకుండా సాగుతుంది. మూడున్నర గంటల నిడివి కచ్చితంగా ‘అవతార్-2’కు ఒక మైనస్ అనే చెప్పాలి. అలా అని కామెరూన్ అండ్ టీం కష్టాన్ని, క్రియేటివిటీని తక్కువ చేయలేం. విజువల్ గా ఈ సినిమా కలిగించే అనుభూతికి ఇంకేదీ మ్యాచ్ చేయలేదని గట్టిగా చెప్పొచ్చు. ఫైనల్‌గా విజువల్స్ అండ్ యాక్షన్ కోసం జేమ్స్ కామెరూన్‌కు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు.
రేటింగ్
3.5 / 5
https://www.youtube.com/watch?v=JF1j24NS77o