▪️ కేసీఆర్, కేటీఆర్​ భరోసా ఇచ్చినట్టు ప్రచారం
▪️ నియోజ‌క‌వ‌ర్గంలో గౌడ్, బీసీ ఓట్లు కీల‌కం
▪️ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు క‌లిగిన ప‌ల్లె ర‌వి
▪️ 6 నెల‌ల‌కే ప‌ద‌వి కోల్పోవాల్సి రావ‌డంతో సానుభూతి

యాదాద్రి (Media Boss Network): లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో త‌మ స‌త్తా చూపించాల‌ని తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ క్ర‌మంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. భువనగిరి లోక్ సభ స్థానం నుంచి చాలామంది బీఆర్ఎస్ నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని గులాబీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో భువనగిరి ఎంపీ టికెట్‌ను తెలంగాణ రాష్ట్ర‌ కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్ ప‌ల్లె ర‌వికుమార్‌కు ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఈ మేర‌కు పార్టీ అధినేత కేసీఆర్‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌మ‌కు కలిసిన ప‌ల్లె ర‌వికి నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర‌ కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా నియ‌మితులైన‌ ఆరు నెల‌ల‌కే ప్ర‌భుత్వం మార‌డంతో ప‌ల్లె ర‌వికుమార్ ప‌ద‌వి కోల్పోవాల్సి వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌పై పార్టీలో సానుభూతి ఉంది. అంతేకాదు భువ‌న‌గిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో గౌడ్ సామాజిక‌వ‌ర్గం ఓట్లు అధికం. గెలుపు ఓట‌మిల‌లో వీరి ఓట్లు ప్ర‌భావితం చూపిస్తాయి. గౌడ సామాజిక‌వ‌ర్గం ఓట్లు కొల్ల‌గొట్టాలంటే ప‌ల్లె ర‌వికుమార్‌కు టికెట్ ఇస్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని బీఆర్ఎస్ నాయ‌క‌త్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ ఓట్లు కూడా అధిక‌మే. ఆ బీసీలు కూడా ప‌ల్లె ర‌వికి మ‌ద్ద‌తు ఇస్తార‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే భువనగిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ల్లె ర‌వి కుమార్ ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin