Hyderabad (Global Times Network):
మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌ముఖులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. తాజాగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విద్యాసాగర్ రావు నివాసానికి వెళ్లి ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. అనంత‌రం ఇరువురు మ‌ర్యాద‌పూర్వ‌కంగా స‌మావేశమ‌య్యారు.

చెన్నమనేని విద్యాసాగర్ రావు.. శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతులకు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. తొలిసారిగా 1980లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరపున పోటీచేసారు. ఆ ఎన్నికలలో ఓటమి పొందిననూ మునుముందు విజయానికి నాంది పలికింది. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికలలో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1989, 1994 ఎన్నికలలో కూడా మెట్‌పల్లి నుంచి వరుస విజయాలు సాధించి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొనసాగారు. 1998లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో ప్రవేశించారు. పార్లమెంటుకు చెందిన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సభ్యుడిగాను పనిచేసారు. 1999లో జరిగిన 13వ లోకసభ ఎన్నికలలో కూడా గెలుపొంది కేంద్రంలో వాజపేయి నాయకత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు. 2014 ఆగస్టు 26న‌ చెన్నమనేని విద్యాసాగర్ రావును మహారాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఆగస్టు 26 నుంచి 2019 సెప్టెంబరు 1 వరకు మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

By admin